ముగిసిన ఫిలిం చాంబర్ ఎన్నికలు

27 Apr, 2014 23:54 IST|Sakshi

తమిళ సినిమా, న్యూస్‌లైన్ : దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిలిం చాంబర్) ఎన్నికలు ఆదివారం చెన్నైలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సి.కల్యాణ్ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. స్థానిక రాయపేటలోని ఉడ్‌లాండ్స్ థియేటర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఫిలిం చాంబర్ కార్యవర్గం పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాలనేది నిబంధన.
 
 ఈ సారి కేరళకు చెందిన వారు చాంబర్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది. ఈ పదవికి కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన పి.శశికుమార్, జి.పి.విజయకుమార్ పోటీ పడటం గమనార్హం. అదేవిధంగా ఉపాధ్యక్షత పదవికి నిర్మాత కె.రాజన్, పి.విజయకుమార్, కోశాధికారి పదవికి బాబు గణేశన్, మురళీధరన్, ఎ.జి.సుబ్రమణి, వెంకటేశ్ పోటీకి దిగారు. వారితోపాటు కార్యవర్గ సభ్యులు పదవికి 40 మంది పోటీ చేశారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్.వర్గం ఫిలిం చాంబర్ ఎన్నికలను బహిష్కరించడంతో చాంబర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.పి.విజయకుమార్‌తోపాటు ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న కె.రాజన్ పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.
 
 ఈ విషయాన్ని వారు ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా తెలియజేయలేదు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలిలో సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలకు చెందిన 2,085 మంది సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్‌తోపాటు కొంత మంది చాంబర్ ఎన్నికలను బహిష్కరించడం వల్ల  బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ఆదిశేషన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిం చారు. లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చాంబర్ అధ్యక్షుడిగా శశికుమార్ (కేరళ), ఉపాధ్యక్షుడిగా విజయ కుమార్ (కర్ణాటక), కోశాధికారిగా మురళీధర్(తమి ళ్), సంయుక్త కార్యదర్శులు కాట్రగడ్డ ప్రసాద్ (తెలుగు), పిఎం అరుళ్‌పతి (తమిళ్) ఎన్నికైనట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు