విచారణకు ఆదేశించండి!

12 Dec, 2015 08:26 IST|Sakshi
విచారణకు ఆదేశించండి!

సెంబరంబాక్కం చెరువు నుంచి ఒకే సమయంలో భారీ ఎత్తున  నీటి విడుదలతోనే చెన్నై అతలాకుతలమైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు.
 
చెన్నై : సెంబరంబాక్కం చెరువు పుణ్యమా చెన్నై ముని గిందన్న సంకేతాలతో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు బయలు దేరాయి. విచారణ కమిషన్ నియమించాలని పట్టుబడుతూ రాజకీయపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలుసుకుని విచారణకు ఆదేశించాలని విన్నవించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేత దురై మురుగన్, ఎంపీ కనిమొళి తదితరులు సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యకు వినతి పత్రం అందజేశారు.
 
చెన్నై అతలాకుతలం కావడం, ఇందుకు ప్రధాన కారణంగా సెంబరంబాక్కం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం గురించి వివరించారు. కూవంనదిలో లక్ష గణపుటడుగుల మేరకు నీళ్లు వదలి పెట్టడంతో ఆ నది ఉగ్రరూపం దాల్చి ఉన్నదని పేర్కొన్నారు. సెంబరంబాక్కం గేట్లను ముందుగానే ఎత్తివేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూసి, చివరకు భారీ ఎత్తున బయటకు పంపడంతో చెన్నై పెను ప్రళయాన్ని ఎదుర్కొన వలసి వచ్చిందని వివరించారు. ముందుగానే నీటి విడుదల జరిగి ఉంటే, ఇంత పెద్ద నష్టాన్ని , కష్టాన్ని చెన్నై ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని ఆ వినతి పత్రం ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు