సమృద్ధిగా నీరు - పరిశుభ్రత

17 Dec, 2014 23:16 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన రాత్రి శిబిరాలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలను చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఈ నెల 15 నుంచి పనిచేయడం ప్రారంభించింది. నగరంలోని అన్ని నైట్ షెల్టర్లకు ప్రతిరోజు 800 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ జలబోర్డును బుధవారం ఆదేశించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వ కార్యదర్శులు, సీనియర్ అధికారులు తరచు గా ఈ నైట్‌షెల్టర్లను తనిఖీ చేయాలని కూడా ఆయన సూచించారు. నగరంలో నైట్‌షెల్టర్ల స్థితిగతులపై లెప్టినెంట్ గవర్నర్ బుధవారం సమీక్షా సమావేశం జరి పారు. నైట్ షెల్టర్లలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బం దిని రెట్టింపు చేయాలని ఎల్జీ డీయూఎస్‌ఐబీని ఆదేశిం చారు. డాక్టర్లు, మొబైల్ క్లినిక్‌లు నైట్‌షెల్టర్లను సందర్శిస్తున్నది లేనిదీ తనిఖీ చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రస్తుతం 130 నైట్‌షెల్టర్లకు డీజేబీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. మరో 79 శిబిరాలకు పైప్‌లైన్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.
 
 ప్రస్తుతం ఢిల్లీలో 219 నైట్‌షెల్టర్లు ఉన్నాయి. శాశ్వత నిర్మాణాలు, పోర్టా కేబిన్లు, టెంట్లు, కమ్యూనిటీ హాళ్ళలో నడుస్తోన్న ఈ షెల్టర్లలో 15,000 మంది తలదాచుకునే వీలుంది. అయితే నగరంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ కొన్ని నైట్ షెల్టర్లలో ఉండడానికి నిరాశ్రయులు ఇష్టపడటం లేదు. నైట్ షెల్టర్ల కన్నా చలిలో నీలాకాశం కింద నిద్రించడాన్నే వారు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైట్‌షెల్టర్లలో ఏవైనా లోపాలుంటే ఎల్జీ లిజినింగ్ పోస్ట్‌కు తెలియచేయాలని నజీబ్‌జంగ్ కోరారు. 155355 టోల్ ఫ్రీ నంబరుకు గానీ, 23975555, 23976666, 23978888, 23994444 నంబర్లకు గానీ కాల్ చేయాలని చెప్పారు. లేదా లిజినింగ్‌పోస్ట్‌ఢిల్లీఎల్‌జీ డాట్‌ఇన్‌కు లాగైగానీ ఎల్‌జీజీసీడాట్ ఢిల్లీకి ఈ మెయిల్ పంపిగానీ తెలియచేయవచ్చు.
 

మరిన్ని వార్తలు