పోలీస్‌స్టేషన్‌లో వినోదం

23 Apr, 2015 02:09 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో వినోదం

 పోలీసులంటేనే రక్షకభటులన్న విషయాన్ని మరచిపోయి చాలామంది వారన్నా, పోలీసుస్టేషన్ అన్నా ఠారెత్తిపోతారు. అలాంటిది పోలీసుస్టేషన్‌నే నేపథ్యంగా తీసుకుని ఒక వినోదాత్మక చిత్రాన్ని నిర్మించేశారు నిర్మాతలు ఆర్ ఎల్ ఏసుదాస్, ఆర్ వై ఆల్విన్, ఆర్.వై.కెవిన్. వీరు అన్నై పుదుమై మాతా ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్ర హీరోగాను మనీషా జిత్ హీరోయిన్‌గాను నటించారు. వర్మం చిత్రం ఫేమ్ రాం కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రానికి విలియమ్స్ సంగీతాన్ని అందించారు.
 
  చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మనిషి జీవితంలో పోగొట్టుకున్న దాన్ని పొందడానికే పోలీసుస్టేషన్‌కు వెళతాడన్నారు. అలాంటి పోలీసుస్టేషన్ అంటే కొందరు వేరే విధంగా భావిస్తారన్నారు. అలాంటిది పోలీసుస్టేషన్ మన ఊరిలో ఉంటే బాగుండు అనేలా విందై చిత్రం చూసిన వారు అనుకుంటారని తెలిపారు. ఊరు నుంచి పారిపోయి వచ్చిన ఒక యువ జంట నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళతారన్నారు. అక్కడ రాత్రి ఒంటిగంట నుంచి మరుసటి రోజు రాత్రి ఒంటి గంట వరకు జరిగే సంఘటనలే విందై చిత్రం అన్నారు.
 
  చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందన్నారు. కొన్ని సన్నివేశాలు మినహా చిత్రం అంతా పోలీసుస్టేషన్‌లోనే చిత్రీకరించినట్లు వివరించారు. విందై చిత్ర నిర్మాణ కార్యక్రమంలో పూర్తి అయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నై వడపళనిలోని కమలా థియేటర్‌లో జరిగింది.
 

మరిన్ని వార్తలు