అనూహ్య హత్య కేసు నిందితుడికి పుంసత్వ పరీక్షలు

13 Mar, 2014 22:35 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యాకు బ్రెయిన్ మాపింగ్‌తోపాటు వివిధ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిందితుడు పట్టుబడినప్పటికీ అనేక విషయాలపై ఇంకా స్పష్టత రావల్సి ఉందన్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ‘నిందితునికి తొందర్లోనే డీఎన్‌ఎ, బ్రేన్ మాపింగ్‌తోపాటు నార్కో అనాలిసెస్, పుంసత్వ పరీక్షలు నిర్వహిస్తాం. నిందితుడు చంద్రబాన్క్త్ర, గోర్ల నమూనాలు తీసుకున్నాం. ఫొరెన్సిక్ లాబ్‌కు పంపాం. అత్యాచారానికి ప్రయత్నించినట్టు తెలువడంతో అసలేమి జరిగిందనే విషయమై అన్ని కోణాల్లో వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే నిందితునికి పుంసత్వ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. అనూహ్య దుస్తులు, కళ్లద్దాలు, మరో రెండు టీ-షర్ట్‌లను కూడా డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపించామ’ని  ముంబై క్రైమ్ బ్రాంచి డీసీపీ అంబాదాస్ పోటే ‘సాక్షి’కి తెలిపారు.

 ముమ్మరంగా ల్యాప్‌టాప్ కోసం గాలింపు...
 ఎస్తేర్ అనూహ్య ల్యాప్‌టాప్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. నిందితుడు ల్యాప్‌టాప్‌ను అంబివలి, షాహాడ్ మద్యలో క్రీక్ (నదీ)లో పడేసినట్టు పోలీసులకు నిందితుడు తెలిపాడు. గజ ఈతగాళ్లతో సహయంతో పోలీసులు ల్యాప్‌టాప్ కోసం గాలిస్తున్నారు.  క్రైమ్ బ్రాంచి ఏసీపీ ప్రఫుల్ భోస్లే నేతృత్వంలోని 20 మంది అధికారులు, 85 మంది పోలీసుల బృందాలు పరిసరాలన్ని జల్లెడ పడుతున్నాయి. అయినప్పటికీ ల్యాప్‌టాప్ లభించకపోవడంతో నిందితున్ని తీసుకుని టీట్‌వాలా నుంచి ఖడవలి ప్రయాణం చేసి అక్కడి పరిసరాలను కూడా పర్యవేక్షించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

క్రైమ్ బ్రాంచి ఇప్పటివరకు ఎస్తేర్ అనూహ్య దస్తులు, బ్యాగ్ ఇతర వస్తువులను కనుగొంది. మరోవైపు చంద్రబాన్ వినియోగిస్తున్న సెల్‌ఫోన్ కూడా దొంగతనం చేసిందని తెలిసింది. గతేడాది వినాయకచవితి ఉత్సవాలలో గ్రాంట్‌రోడ్డులో ఈ సెల్‌ఫోన్ చోరీ చేసినట్టు తెలిసింది. ఇదిలాఉండగా హత్య చేసిన అనంతరం  చంద్రబాన్ నాసిక్ త్రయంబకేశ్వర్‌లో కాలసర్పయాగం, ఇతర పూజలు చేసినట్టు తెలిపాడు. దీనిపై పూజలు నిర్వహించిన బ్రహ్మణుల వాంగ్ములాన్ని కూడా పోలీసులు సేకరించారు.

 పూజలు నిర్వహించే సమయంలో చంద్రబాన్ తీవ్ర భయాందోళనలతో ఉన్నట్టు బ్రహ్మణులు తెలిపినట్టు తెలిసింది.

 రేపటితో ముగియనున్న గడువు...
 అనూహ్య హత్య కేసులో అరెస్టు చేసిన నిందితుని పోలీసు కస్టడీ గడవు శనివారంతో ముగియనుంది. అదేరోజు నిందితున్ని ముంబై సీఎస్‌టీ సమీపంలోని ఖిల్లా కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుడిని విచారించేందుకు మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరాలని పోలీసులు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు