అనూహ్య కేసులో కీలక మలుపు

26 May, 2014 22:07 IST|Sakshi

సాక్షి ముంబైః ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసుపై ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలయింది. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ ధాతే ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడిని అరెస్టు చే శామన్నారు. లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 76 మంది సాక్షులున్నట్టు చెప్పారు. ప్రధాన నిందితుడు చంద్రభాన్ సానప్ ఎలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.  

 కళ్లద్దాలు, ఐడీ కార్డుతో సరిపోలిన డీఎన్‌ఏ...
 కేసు దర్యాప్తునకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్, దుస్తులు, ఐడీకార్డు తదితరుల వస్తువుల్లో లభించిన డీఎన్‌ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి సేకరించిన అనూహ్య కళ్లద్దాలు, ఐడీ కార్డు నుంచి లభించిన డీఎన్‌ఏ అనూహ్య డీఎన్‌ఏతో సరిపోలింది. ఏసీపీ ప్రఫుల్ మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ‘డీఎన్‌ఏతోపాటు అనేక ఆధారాలను సేకరించాం. 76 మంది సాక్షులనూ ప్రశ్నించాం. ఈ ప్రక్రియ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశాం. అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో అనేక ఆధారాలకు నష్టం వాటిల్లింది. అయినా శ్రమించి చంద్రభానును పట్టుకోవడంతోపాటు పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాం.  అనూహ్యను మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్తుండగా కూడా చూసిన ప్రత్యక్ష సాక్షులనూ గుర్తించాం. వీరితోపాటు అనేక మందిని విచారించాం. అనంతరం నిర్వహించిన పరేడ్‌లో కూడా నిందితున్ని సాక్షులు గుర్తుపట్టారు’ అని ఆయన వివరించారు.  

 అత్యచారం జరిగింది...!
 అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం వైద్యపరీక్షల్లో తేలలేదు. అత్యాచారం జరిగినట్టు తమ దర్యాప్తులో తేలిందని ప్రఫుల్ బోస్లే పేర్కొన్నారు. దీంతో నిందితునిపై 302, 364, 366, 376(2)(ఎస్), 376ఎ, 397, 210, 170 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 లభించని ల్యాప్‌ట్యాప్...  
 అనూహ్య వస్తువుల్లో కీలకమైన ల్యాప్‌టాప్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీనికోసం ఇప్పటికీ గాలిస్తున్నామని ప్రఫుల్ తెలిపారు. దానిని ఆంబివలి, షాహాడ్ సమీపంలోని క్రీక్‌నదీలో పడేసినట్టు నిందితుడు పేర్కొన్నాడు. దీంతో గజ ఈతగాళ్ల సహకారంతో ల్యాప్‌టాప్ కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ ప్రఫుల్ నేతృత్వంలోని 20 మంది అధికారులు, 85 మంది పోలీసుల బృందాలు పరిసరాలను జల్లెడపట్టాయి. అయినప్పటికీ ల్యాప్‌టాప్ ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే అనూహ్య కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్ రాజన్ ఠాక్రేను ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా నియమించాలని కోరినట్టు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ దాతే తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు.

 స్వగ్రామం నుంచి జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదయింది. కుళ్లిపోయిన ఈమ మృతదేహం 16న భాండుప్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో దొరికింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె ముంబై టీసీఎస్‌లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసేది.
 
 అనూహ్య కేసు పూర్వాపరాలు
 2014, జనవరి 4: క్రిస్మస్ సెలవులు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో గడిపిన అనూహ్య తిరిగి ముంబైకి
 5: విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి తెల్లవారుజాము ఐదు గంటల ప్రాంతంలో కుర్లా టెర్మినస్‌లో రైలు దిగింది.
 6: అపహరణకు గురైనట్లు ఆమె బంధువులు హైదరాబాద్ , విజయవాడలో కేసు నమోదు చేశారు.
 7: అనూహ్య బంధువులు కూడా కుర్లా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 8: కుర్లా రైల్వే పోలీసులతోపాటు రైల్వే నేర శాఖ, ముంబై పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.
 16: కంజూర్‌మార్గ్ ప్రాంతంలో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే పక్కనున్న చెట్ల పొదల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం
 20: మొబైల్ ఫోన్, కాల్ హిస్టరీ వివరాలు పోలీసులకు లభ్యం, రక్తంతో తడిసిన దుప్పటి లభ్యం.
 21: హత్యకు గురైన చోటికి కొద్దిదూరంలో దుస్తులతో కూడిన బ్యాగు లభ్యం.
 22: బంధువులు, స్నేహితులతో విచారణ జరిపి వివరాలు సేకరణ
 23: ఘటనా స్థలం వద్ద క్రైస్తవుల శాంతి ర్యాలీ  
 30: సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు
 31: అనూహ్య సన్నిహితులను విచారించిన పోలీసులు
 ఫిబ్రవరి 2: కేసు దర్యాప్తు కోసం అనూహ్య స్వస్థలానికి పోలీసులు  
 3: కుర్లా టెర్మినస్‌లోని సీసీ టీవీలకు మరమ్మతులు, మరిన్ని సీసీ టీవీలు ఏర్పాటుచేయాలని పోలీసుల ప్రతిపాదన
 4: దర్యాప్తు కోసం ముంబైలోని ఆర్టీఓ సాయం
 5: అనుమానితులుగా కనిపిస్తున్నవారి వివరాల సేకరణ
 24: అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు
 26: సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తిచేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించిన పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా  
 మార్చి 2: నిందితుడు సానప్ అరెస్టు
 మే 26: అభియోగపత్రం దాఖలు

మరిన్ని వార్తలు