అడ్డుకునే దమ్ముందా

22 Feb, 2014 02:58 IST|Sakshi
అడ్డుకునే దమ్ముందా

అడ్డుకునే దమ్ముందా
 సాక్షి, చెన్నై:  కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే అడ్డుకునే దమ్ముందా అని పెరియార్ ద్రవిడ కళగం నాయకులకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సవాల్ విసిరారు.
 
 రాజీవ్ హంతకుల విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో శుక్రవారం చెన్నైలో నిరసన దీక్ష చేప్టారు. అలాగే రాజీవ్ గాంధీతో పాటు హత్యకు గురైన 17 మంది తమిళులు కాదా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కరపత్రాలు విడుదల చేశారు. రాజీవ్‌గాంధీ హంతకుల్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనికి సుప్రీంకోర్టు ద్వారా కేంద్రం కల్లెం వేయించడం తెలిసిందే.
 
  ఈలం తమిళుల్ని విడుదల చేయనీయకుండా అడ్డుకున్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు ఖండిస్తున్నాయి. పెరియార్ ద్రవిడ కళగం ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో అడుగు పెడితే అడ్డుకుంటామంటూ కేంద్ర మంత్రులను హెచ్చరించింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మినహా ఇతర పార్టీల నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ అన్నాసాలైలోని విద్యుత్ భవన్ వెనుక నిరసన దీక్ష నిర్వహించింది.
 
 
  ఈ నిరసనకు యూత్ కాంగ్రెస్ నేత ఎన్.రాజేష్ నేతృత్వం వహించారు. ఇందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, ఈవీకేఎస్ ఇళంగోవన్, కుమరి ఆనందన్,  పాల్గొన్నారు. జ్ఞానదేశికన్ మాట్లాడుతూ దమ్ముంటే తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల్ని అడ్డుకోండని, అప్పుడు తామేమిటో తెలుస్తుందంటూ పెరియార్ ద్రవిడ కళగం నాయకులను హెచ్చరించారు. రాజీవ్ హంతకుల శిక్షను సుప్రీం కోర్టు తగ్గించిందేగానీ, విడుదల చేయమని ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. కోర్టు తీర్పు ఇలా ఇచ్చిందో లేదో, మరుసటి రోజే రాజకీయ లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో వారిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఇతర కేసులకంటే రాజీవ్ హత్య కేసు భిన్నమైనదని పేర్కొన్నారు.
 
  ముంబైలో నరమేధం సృష్టించిన కసబ్‌కు రాజీవ్ హంతకులకు తేడా లేదని, వారిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. తామేదో తమిళులకు ద్రోహం తలపెడుతున్నట్టు కొందరు చిత్రీకరిస్తున్నారని, ఈలం తమిళులకు మద్దతుగా తామూ పోరాడుతున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజీవ్ హంతకుల వ్యవహారంలోకి ఈలం తమిళుల ప్రస్తావన తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ మీద దాడులకు దిగితే ప్రతిదాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. కోయంబత్తూరులో తమ పార్టీ నేత ప్రభు ఇంటిపై చేసిన పెట్రో బాంబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వ తీరును నిరసిస్తూ కరపత్రాల పంపిణీకి కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు.
 
 
  రాజీవ్ హత్యా ఘటన జరిగిన రోజున 17 మంది మరణించారని, వీరంతా తమిళులు కాదా...? వీరికి న్యాయం చేయరా..? అన్నప్రశ్నల్ని సంధిస్తూ ఈ కరపత్రాల పంపిణీలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి.
 
 
 

మరిన్ని వార్తలు