సవాళ్లు.. ప్రతి సవాళ్లు

6 Nov, 2015 02:37 IST|Sakshi


 సాక్షి, చెన్నై : కాంగ్రెస్‌లో సవాళ్లు...ప్రతి సవాళ్ల వార్ నడుస్తోంది. ఈవీకేఎస్, ప్రత్యర్థి వర్గం మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈవీకేఎస్ ఆరోపణలకు గురువారం తంగబాలు ప్రతి సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ వాదులు ఏకంగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఈవీకేఎస్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ర్ట కాంగ్రెస్‌లో పదవీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్‌ను పదవీచ్యుతుడ్ని చేయించి, ఆ కుర్చీని తమలో ఎవరో ఒకరు దక్కించుకోవాలని 11 మందితో కూడిన గ్రూపు నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్లి వచ్చింది.
 
 పార్టీ రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానం పెద్దలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు మూడు రోజులుగా ఈవీకేఎస్‌ను పదవి నుంచి తప్పించడం కోసం గ్రూపు నేతలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లకు దారితీస్తోంది. తన మీద ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా మాజీ అధ్యక్షుడు తంగబాలు ప్రకటించడంతో ఆయనపై ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యక్తిగత ఆరోపణలతో నోరు జారారు. దీంతో కాంగ్రెస్ నేతల అక్రమార్జన చర్చ తెరమీదకు వచ్చింది.
 
  నువ్వింత సంపాదించావంటే కాదు నువ్వింత సంపాదించావని ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు తీవ్రంగానే స్పందించారు. చర్చకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. తంగబాలు మీడియాతో మాట్లాడుతూ తానేదో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్ని కబ్జా చేసి, ఇంజినీరింగ్ కళాశాలలు కట్టినట్టుగా ఆరోపిస్తున్న ఆ పెద్ద మనిషి, తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. జానపద కళాకారుడు కోవన్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలతో కూడిన పాటల్ని గతంలో పాడిన విషయాన్ని గుర్తు చేశారు.
 
 అలాంటి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి ఉన్నారని, ఆ అరెస్టును ఖండిస్తూ, కోవన్‌కు మద్దతుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ విషయమై చర్చించడానికే ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఎవర్నో పదవి నుంచి తప్పించాలనో, మరెవర్నో కూర్చోబెట్టాలనో తాము ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు. ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే రీతిలో వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు ఈవీకేఎస్ దిగడాన్ని ఖండించారు.
 
 తాను ఒక్క సె.మీ స్థలాన్ని కూడా ఆక్రమించలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవుపలికారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వాదులు కొందరు ఏకంగా ఈవీకేఎస్, ఆ పార్టీ మరో నేత గోపన్నపై గురువారం చెన్నై కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఆరాధ్యుడు పొసుం పొన్ ముత్తురామ దేవర్‌కు వ్యతిరేకంగా గోపన్న పార్టీ కార్యక్రమంలో స్పందించారని, ఇందుకు ఈవీకేఎస్ ఎలాంటి అడ్డు చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  తమ ఆరాధ్య నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారం ఈవీకేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెడుతుందో చూడాలి. ఆయనకు మద్దతుగా పార్టీ అధికార ప్రతినిధి కుష్భు మాత్రం ఢిల్లీ పెద్దల వద్ద స్పందించి ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు