20 మెట్రో స్టేషన్లలో ‘ఎగ్జాక్ట్ చేంజ్ కౌంటర్లు’

23 Feb, 2015 23:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో 20 స్టేషన్లలో ‘ఎగ్జాక్ట్ చేంజ్ కౌంటర్లు’ ప్రారంభించింది. టోకెన్‌కి సరిపడా డబ్బుని వీటి ద్వారా చెల్లించి టికెట్టు కొనుక్కోవచ్చు. తద్వారా టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూలకు ఇకపై ఫుల్‌స్టాపు పడుతుంది. ‘తమ గమ్యస్థానం చేరేందుకు కొనాల్సిన టోకెన్‌కు సరిపడా డబ్బు ఉన్న వారే ఈ కౌంటర్లను ఉపయోగించుకోవచ్చు. వీటి వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. భారీ క్యూలకు అసలు ఆస్కారమే లేదు’ అని మెట్రో వర్గాలు వెల్లడించాయి. ఈ కౌంటర్లను ఏర్పాటు చేసిన స్టేషన్లలో న్యూఢిల్లీ, చాందినీ చౌక్, రాజీవ్ చౌక్, ఆనంద్ విహార్, హుడా సిటీ సెంటర్, జహంగీర్‌పురి, ఉత్తమ్ నగర్ ఈస్ట్, ఎంజీ రోడ్, ఎయిమ్స్, వైశాలి, కరోల్‌బాగ్, సీలంపూర్, నోయిడా సిటీ సెంటర్ ఉన్నాయి. కాగా, పేరుకి ప్రయాణికుల సౌకర్యం కోసం అని ఢిల్లీ మెట్రో పైకి చెబుతున్నా, చిల్లర బాధ నుంచి బయట పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ప్రయాణికులకు చెల్లించేందుకు రూ.  7 లక్షల నాణేలు అవసరమవుతున్నాయి. ఇది మెట్రోకి ఓ పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి ముగింపు పలకడానికి ఈ కౌంటర్లను ఏర్పాటు చేసింది.
 

>
మరిన్ని వార్తలు