తప్పని విస్తరణ

11 Jul, 2015 02:11 IST|Sakshi
తప్పని విస్తరణ

చర్చకు రాని ప్రముఖ ముసాయిదా బిల్లులు
 ఈ నెల 24కు ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
 సమావేశాల గడువును విస్తరించే దిశగా ప్రభుత్వ సన్నాహాలు

 
బెంగళూరు: ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోవడంతో వర్షాకాల సమావేశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24తో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ అనుమతి పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సమావేశాల నిర్వహణను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం బెళగావిలోని సువర్ణసౌధలో జరిగిన సభా సలహా సమితి సమావేశంలో సైతం తీర్మానం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈనెల 24న ముగియాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు 29 వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బెళగావిలో సువర్ణసౌధలో 10రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి మూడు రోజులు చెరకు రైతుల ఆత్మహత్యలే ప్రతిధ్వనించాయి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల పట్ల చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కన్నడనాడులో చెరుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించడంతో పాటు రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రతిపక్షాలు మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వలేదు. అనంతరం లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఉభయ సభలు అట్టుడికాయి. లోకాయుక్త వై.భాస్కర్‌రావును పదవీచ్యుతిడిని చేయాలనే డిమాండ్‌తో బీజేపీ, జేడీఎస్‌లు సంయుక్తంగా ఎమ్మెల్యేల సంతకాల సేకరణను సైతం ప్రారంభించాయి. ఇక ఇంకోరోజు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖలో వెలుగుచూసిన పరుపులు, దిండ్ల కుంభకోణంతో ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. ఇలా బెళగావిలోని సువర్ణసౌధలో 10రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికే ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను సభల్లో ప్రవేశపెట్టలేకపోయారు.

ఇక సువర్ణసౌధలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. తిరిగి సోమవారం నుంచి బెంగళూరులోని విధానసౌధలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24నాటికి ఈ సమావేశాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదాన్ని పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సభా కార్యకలాపాలను పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
 

మరిన్ని వార్తలు