అమ్మపై కుట్ర

11 Oct, 2016 03:47 IST|Sakshi
అమ్మపై కుట్ర

సీబీఐ విచారణకు ఎంపీ శశికళ పుష్ప డిమాండ్
 శశికళ పథకం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి

 
 సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్రపన్నుతున్నారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. అక్రమంగా జయ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సోమవారం ఆమె ఒక లేఖను పంపారు.
 
  సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత నెచ్చెలి శశికళపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. జయలలిత అనారోగ్యానికి దారితీసిన పరిస్థితుల్లో సీబీఐ విచారణ అవసరమని శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ, నటరాజన్ వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వారందరినీ అపోలో నుంచి పంపించేయాలన్నారు.
 
 అన్నాడీఎంకే దిశగా కాంగ్రెస్
 గత పదేళ్లుగా డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇపుడు అన్నాడీఎంకే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేతపుచ్చుకునేందుకు శశికళ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకొంది. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న శశికళ.. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా రావడం శశికళ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు.

 

మరిన్ని వార్తలు