నకిలీల ఖిల్లా

18 Jan, 2015 02:31 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతుండగా ఈ పరిస్థితిని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. విరుదునగర్ జిల్లా నకిలీ వైద్యుల ఖిల్లాగా మారిపోవడంతో వీరివద్ద వైద్యం చేయించుకున్న 19 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. వారికి వైద్యం చేసిన 25 మంది నకిలీ వైద్యులు కటకటాల పాలయ్యారు. పగలు మాత్రమే కుట్టి, డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమలు విరుదునగర్‌లో ఇటీవల విరుచుకుపడ్డాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు డెంగీ జ్వరాల బారిన పడ్డారు. అక్షరాస్యత అంతగా లేని అమాయక పేద ప్రజలు ఆందోళనతో  సమీపంలోని వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నారు. వైద్యం వికటించగా వారంరోజుల్లోనే 19 మంది మృత్యువాత పడ్డారు. స్వల్ప వ్యవధిలో డెంగీ మృతులు భారీగా పెరడంతో ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, పోలీసు యంత్రాంగం వేర్వేరుగా విచారణలు చేపట్టారు. ఆస్పత్రులను, జిల్లాలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 50 ప్రొక్లయిన్ల ద్వారా పంటకాల్వల్లో పూడికలు తీయించి దోమల నివారణ చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాల్లో  పందుల పెంపకం సాగిస్తున్న 20 మందిని అరెస్ట్ చేసి 150 పందులను స్వాధీనం చేసుకున్నారు.
 
 నకిలీ వైద్యుల గుట్టురట్టు
  మృతుల కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో చికిత్స చేసిన వైద్యుల వివరాలను అధికారులు కోరారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ ైవె ద్యులు రాజ్యమేలుతున్నట్లు తేలింది. నకిలీ వైద్యులు అందించే వైద్యం వల్ల రోగం తగ్గకపోగా మరింత  ముదిరి ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వరన్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు చేపట్టింది. 8వ తరగతి వరకు చదివిన ఒకవ్యక్తి కొన్నాళ్లు ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసిన అనుభవంతో వైద్యుడిగా అవతారం ఎత్తాడు. మరొక వ్యక్తి మందుల దుకాణంలో పొందిన అనుభవంతో వైద్యం ప్రారంభించాడు. సాత్తూరులో ఒక పెట్టెల వ్యాపారి తన ఇంటిలో ఫలసరుకులతోపాటూ ఫార్మసీ మందులను సైతం విక్రయించడాన్ని కనుగొన్నారు.
 
 అంతేకాదు తన వద్దకు వచ్చిన వినియోగదారుల యోగక్షేమాలు అడిగి కోరినవారికి ఇంజక్షన్లు సైతం ఇచ్చేవాడని తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత పోయారు. మరికొందరు ప్రబుద్దులు మోటార్‌బైక్‌పై గ్రామగ్రామాన తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు. అనేక రకాలైన 25 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలోకి నెట్టారు. సంచార వైద్యులుగా చలామణి అవుతున్న వారి కోసం గాలిస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై కేసులు బనాయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు బాలకృష్ణన్ మాట్లాడుతూ, డెంగీ, చికున్ గున్యా వంటి తీవ్రస్థాయి వ్యాధులను నకలీ వైద్యులు సాధారణంగా తీసుకుని వైద్యం చేయడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నకిలీ వైద్యం కల్తీ కల్లు అంతటి ప్రమాదకరమన్నారు. న కిలీలపై అధికారులు నిఘాపెట్టి ఆగడాలను అరికట్టాలని ఆయన కోరాడు.
 

>
మరిన్ని వార్తలు