నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

3 Aug, 2019 22:08 IST|Sakshi

బరంపురం : జర్నలిస్టుల పేరిట పలు మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గంజాం జిల్లాలోని బల్లిపడలో ఉన్న సరస్వతి శిశు మందిర్‌ విద్యాలయాన్ని శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారులో చేరుకుని, పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, ఫొటోలు తీశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కావాలి్సన కనీస సదుపాయాలు లేవని, పాఠశాల యాజమాన్యాన్ని బెదిరించారు. తామంతా ఎంబీసీ టీవీ చానల్‌కు చెందిన జర్నలిస్టులమని, మీ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని, ఆ విషయాన్ని వార్తల్లో ప్రసారం చేయకుండా ఉండాలంటే, తమకు కొంత డబ్బును లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదే విషయంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం ఎదురుదాడికి దిగి, జరిగిన సంఘటనపై సదర్‌ పోలీసులకు సమాచారమిచి్చంది. ఇదే విషయంపై స్పందించిన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. దీంతో వారంతా నకిలీ జర్నలిస్టులుగా తేలడంతో వారితో పాటు కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అనంతరం వారి వినియోగిస్తున్న పలు మీడియా పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో బరంపురం నగరానికి చెందిన దీపక్‌ బడిప్యా, సునీల్‌ పొడియారి, తపన్‌ పట్నాయక్, డ్రైవరు డి.నాగేశ్వర్‌ ఉన్నట్లు ఐఐసీ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు