విద్యార్థి మృతదేహంలో కిడ్నీలు మాయం

19 Jun, 2016 08:33 IST|Sakshi

తల్లిదండ్రుల ఆవేదన
ప్రజల రాస్తారోకో
 
టీనగర్: విద్యార్థి మృతదేహంలో కళ్లు, కిడ్నీలు మాయం కావడంతో తల్లిదండ్రులు, ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. అదృశ్యమైన విద్యార్థి శవాన్ని తోగైమలై సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. కరూర్ జిల్లా, కడవూరు యూనియన్ పన్నపట్టి పంచాయతీ ఉడయపాడికి చెందిన జయశీలన్ కుమారుడు మరియ వివేక్ (17). ఇతడు బి.ఉడయాపట్టిలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నాడు. ఈ నెల 11న సైకిల్‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై తల్లిదండ్రులు తోగైమలై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగా  శుక్రవారం ఉదయం అతని మృతదేహం పన్నపట్టి కొలనులో కుళ్లిన స్థితిలో లభించింది. దీంతో డాక్టర్ విజయ సురేందర్ ఆధ్వర్యంలోని ఐదుగురు వైద్య బృందం అక్కడే పోస్టుమార్టం జరిపింది. అందులో విద్యార్థి కళ్లు, మూత్రపిండాలు లేనట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహంతో మృతదేహాన్ని ఒక పెట్టెలో ఉంచి తరగంపట్టి-కుళిత్తలై రోడ్డులో ఉడయాపట్టిలో శుక్రవారం మధ్యాహ్నం రాస్తారోకో నిర్వహించారు. ఇందులో ఇతర పాఠశాలల విద్యార్థులు సైతం పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీనివాసన్ వారితో చర్చలు జరిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

మరిన్ని వార్తలు