ఏం జరుగుతోంది?

20 Jul, 2015 03:15 IST|Sakshi
ఏం జరుగుతోంది?

- సీఎం సిద్ధరామయ్య
- రైతు ఆత్మహత్యలకు కారణం అప్పులా? పంట నష్టాలా!
- తేల్చేందుకు ప్రత్యేక సమితి ఏర్పాటు
- రైతు వ్యతిరేక సిఫారసులు ఉన్నందునే అమలుకు నోచుకోని డాక్టర్‌వీరేష్ కమిటీ నివేదిక
- చెరుకు బకాయిలు విడుదల
మండ్య :
రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అసలైన కారణాలు ఏమిటో తనకు తెలియాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందుకు గాను డాక్టర్ ఎస్.స్వామినాథన్ నేకృత్వంలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల బలవన్మరణాలకు పా ల్పడిన రైతుల కుటుంబసభ్యులను ఓదార్చేందుకు ఆదివారం మండ్య జిల్లాలో ము ఖ్యమంత్రి పర్యటించారు. మండ్య తాలూకాలోని హొన్నయ్యనహళ్లికి చేరుకుని రైతు శివలింగేగౌడ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మండ్య, మైసూరు జిల్లా ల్లో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆత్మహత్యల వెనుక కారణాలు అ ర్థం కావడం లేదన్నారు. అప్పుల బాధ లా... పంట నష్టాలా... ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, సమస్యల పరిష్కారానికి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. 14 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.  ఇప్పటికే మండ్య జిల్లాలో 50 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. రాష్ర్టంలో అన్నదాతలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని మనవి చేశారు.
 
ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ సమయంలో అప్పటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీరేష్ నేకృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆత్మహత్యలపై అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 2002, ఏప్రిల్ 27న ఓ నివేదికను వీరేష్ కమిటీ అప్పటి ప్రభుత్వానికి అందజేసిందని అన్నారు. అందులోని సిఫారసులు రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని అమలు చేయరాదంటూ అప్పట్లో రైతు సంఘం, రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే ఆ కమిటీ సిఫారసులు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయం మాజీ సీఎం ఎస్‌ఎం ృష్ణకు గుర్తుకు లేనట్లుందని అన్నారు.  
 
చెరుకు బకాయి విడుదల
2013-14 ఏడాదికి సంబంధించి రూ.1520కోట్ల చెరుకు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆ సంవత్సరంలో ప్రతి టన్ను చెరుకుకు రూ.2500 చొప్పున ఇచ్చారని తెలిపారు. 2014-15లో ఎఫ్‌ఆర్‌పీ రూ.2200లను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మొతాతన్ని ఇంకా అనేక ప్రైవేట్ పరిశ్రమలు ఇవ్వలేదని, కొన్ని పరిశ్రమలు రూ. 1500 చొప్పున ఇచ్చాయని అన్నారు. మరికొన్ని పరిశ్రమలు రూ.1800 చొప్పున చెల్లించాయని తెలిపారు. 2013-14 ఏడాదికి సంబంధించి బకాయిలను ఈ నెల చివరిలోపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
బాధిత కుటుంబంలోని సభ్యురాలికి ప్రభుత్వ ఉద్యోగం
మండ్య తాలూకాలోని హోన్నాయ్కనహళ్ళి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు శివలింగేగౌడ ఇంటికి వచ్చిన సీఎం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి రూ. లక్ష చెక్ అందజేశారు. సుమారు 45 నిమిషాల పాటు వారి క్షేమసమాచారాలు వాకాబు చేశారు. అనంతరం బాధపడకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శివలింగేగౌడ భార్య సౌమ్య పీయూసీ చదివినట్లు తెలుసుకుని ఆమెకు కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్ అజయ్ నాగభూషన్‌ను ఆయన ఆదేశించారు.

ఆదిచుంచనగరి విద్యాసంస్థలో చదువుకుంటున్న వారి పిల్లలకు ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించడం జరిగిందని, జిల్లా యంత్రాంగం ఇప్పటికే శివలింగేగౌడ కుటుంబానికి రూ. లక్ష అందజేసిందని, మిగిలిన రూ. లక్షను తన సమక్షంలో అందజేశారని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహదేవప్రసాద్, అంబరీష్, ఎమ్మెల్యే నరేంద్రస్వామి, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు