పిలిచి పొమ్మంటారా?

5 Oct, 2016 14:27 IST|Sakshi
 
  వ్యవసాయ అధికారులపై రైతుల మండిపాటు
  నిలిచిన పప్పుశగన విత్తనాల పంపిణీ
  ఆందోళనకు దిగిన రైతులు 
  నేటినుంచి సరఫరా చేస్తాం : ఏడీఏ ఖాద్రి
 
మానవపాడు : పప్పుశనగ విత్తనాలిస్తరంటే పొద్దున్నే వచ్చినం.. మంది ఎక్కువగా ఉంటే పాస్‌పుస్తకాలను క్యూలో పెట్టి గంటల తరబడి ఎండలో నిల్చున్నం.. టైముకు వస్తరనుకుంటే లేటుగా వచ్చి ఇప్పుడేమో పంపిణీ లేదంటారా.. రెండురోజులనుంచి కళ్లకు కాయలు కాసేలా చూస్తుంటే సమాధానం చెప్పేటోళ్లు కూడా ఎవ్వరు లేరు.. అదేం పద్ధతి.. అంటూ రైతులు వ్యవసాయ అధికారులపై కోపమయ్యారు. వివరాలిలా.. ఈ ప్రాంతంలో రబీలో పప్పుశనగ విత్తనాలు ఎక్కువశాతం పండిస్తారు. అధికారులు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి మంగళవారం వివిధ ప్రాంతాల రైతులు తెల్లవారుజాము నుంచే స్థానిక వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు.
 
అయితే అధికారులు 11 గంటలకు తాపీగా వచ్చి ఈ రోజు విత్తనాలు పంపిణీ చేయడంలేదు.. అని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు అధికారులతో వాగ్వాదం చేశారు. అన్ని ప్రాంతాల్లో విత్తనాలు పంపిణీ చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరైంది కాదన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లో విత్తనాలు ఇవ్వకపోతే కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించారు. రుణాలు అందక పెట్టుబడికి పైసల్లేవని తిరుగుతుంటే దూర గ్రామాలనుంచి మమ్ముల్ని పిలిపించుకొని కాదని పొమ్మంటారా.. ఇది మీకు న్యాయమా అని పలువురు రైతులు వాపోయారు. 
 
 ఆందోళన వద్దు.. అందరికీ అందిస్తాం 
 రైతులు భయపడాల్సిన పనిలేదని.. అందరికి కావాల్సిన విత్తనాలను పంపిణీ చేస్తామని ఏడీఏ ఖాద్రీ రైతులకు నచ్చజెప్పారు. బుధవారం నుం చి పాస్‌బుక్‌లను పరిశీలించి గ్రామాల వారీగా అందిస్తామన్నారు. 5న మానవపాడు, అమరవాయి, ఏ బూడిదపాడు, 6న పుల్లూరు, కలుగోట్ల, మెన్నిపాడు,7న ఉండవెల్లి, కంచుపాడు, చెన్నిఅముదాలపాడు, 8న ఇటిక్యాలపాడు, బొంకూరు, నారాయణపురం, గోకులపాడు,9న పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, పెద్దఅముదాలపాడు, 10న కొర్విపాడు, మద్దూరు, కలుకుంట్ల, 13న చంద్రశేఖర్‌నగర్, జల్లాపురం, బోరవెల్లి, 14న పల్లెపాడు, చండూరు గ్రామాల రైతులకు పంపిణీ చేస్తామని వివరించారు.
మరిన్ని వార్తలు