నత్తనడకన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు

14 Sep, 2013 23:36 IST|Sakshi


 ముంబై: నగరంలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నింపాదిగా నడుస్తున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు వేగంగా విచారించి తీర్పును వెలువరించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తమ లక్ష్యాన్ని చేరువ కాలేకపోతున్నాయి. ముంబై సెషన్స్ కోర్టులో సుమారు 100 ఫాస్ట్‌ట్రాక్ కేసుల తీర్పు వెలువరించాల్సి ఉంది. ఫాస్ట్ ట్రాక్ కేసులన్నీ నింపాదిగా నడుస్తున్నాయని సెషన్స్ కోర్టులోని న్యాయవాదులు మండిపడుతున్నారు. ‘జీవితఖైదు విధించాల్సిన హత్య కేసులు సెషన్స్ కోర్టులో విచారణకు రావడం లేదు. ఇప్పుడు అన్ని కేసులు వస్తున్నాయి. అయితే ఏ కేసు విచారణ నిర్ధిష్ట కాలపరిమితిలోగా జరగడం లేద’ని ఆరు ఫాస్ట్‌ట్రాక్ కేసులను వాదిస్తున్న షరీఫ్ షేక్ తెలిపారు. తాను వాదిస్తున్న అనేక ఫాస్ట్‌ట్రాక్ కేసుల్లో సాక్ష్యాల నమోదు పూర్తి కాలేదన్నారు. ఇందులో రెండేళ్ల క్రితం నాటి కేసులున్నాయని, అవన్నీ అభియెగాల నమోదు స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. అయితే సీనియర్ న్యాయవాది రోహిని సైలాన్ మరో రకమైన వాదన వినిపిస్తున్నారు. ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం లేదని, ప్రతి కేసును సమానంగానే చూడాలని అన్నారు.
 
  ‘ఫాస్ట్ ట్రాక్ కేసులు ఆలస్యమవుతున్నాయంటే అది కోర్టు తప్పు కాదు. సంబంధిత కేసులో నిందితులు, సాక్షులు, డిఫెన్స్ లాయర్‌లు హాజరుకాకపోవటం వల్ల విచారణ ఆలస్యమవుతుంద’ని సైలాన్ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 100కు పైగా కేసులు ఉన్నాయని న్యాయవాది నీలిమా కస్తూరే అన్నారు. అయితే ఈ కోర్టులు ఉపకరిస్తాయని తాననుకోవడం లేదని తెలిపారు. దీనివల్ల ఫాస్ట్‌ట్రాక్ కాని ఇతర కేసుల విచారణపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు