అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..

11 Aug, 2017 13:12 IST|Sakshi
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..

ముంబై: ఆన్‌లైన్‌ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా నీట్‌గా ప్యాక్‌ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి సంబంధించి తన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా ఐటీ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మహ్మద్‌ సర్వార్‌ అనే బాధితుడు మూడు నెలలుగా అమెజాన్‌తో పోరాడుతున్నారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మహ్మద్‌ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోరం వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.

ఈ ఏడాది మేలో 50 అంగుళాల మితాషి ఎల్‌ఈడీ టీవీ అమెజాన్‌ డిస్కౌంట్‌పై అందుబాటులో​ ఉండటంతో దాన్ని పిల్లలకు రంజాన్‌ కానుకగా అందించాలని నిర్ణయం తీసుకున్న సర్వార్‌ వెంటనే క్రెడిట్‌ కార్డు ద్వారా రూ 33,000 చెల్లించారు. మే 19న ప్యాకేజ్‌ను అందుకున్న సర్వార్‌ దాన్ని తెరిచి చూడగా అందులో టీవీకి బదులు 13 అంగుళాల పాత ఏసర్‌ మానిటర్‌ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అప్పటినుంచి తన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనలకు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. మరోవైపు కస్టమర్‌ సమస్యను తాము అర్థం చేసుకున్నామని, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు