లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలి

14 Sep, 2013 00:17 IST|Sakshi
న్యూఢిల్లీ: మహిళ వేషధారణ వారి మీద జరుగుతున్న నేరాలకు కారణమనడం సహేతుకం కాదు. మహిళలు వారి మీద జరుగుతున్న దాడులకు వ్యతి రేకంగా తిరగబడాల్సి ఉంది అని జామియామిలియాలో జరిగిన ఓ సదస్సులో పిలుపునిచ్చింది. నిర్భయ మీద జరిగిన దాడితో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువెత్తినా పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. లింగవివక్షపై జామియా మిలియాలో జరిగిన సదస్సులో పాలుపంచుకొన్న విద్యార్థులు వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడడమే మహిళ ముందున్న పరిష్కార మార్గమని విద్యార్థులు ఎలుగెత్తారు. 
 
 విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ ఫిజియో థెరపీలో పీజీ చేస్తున్న టాంజీలా తాజ్ మాట్లాడుతూ‘‘ఆకతాయిలు చేసే వాఖ్యానాలను అనేక సార్లు తిప్పికొట్టాను. ఒక సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఒంటిని తాకినవాడిని ఈడ్చికొట్టాను. మరొకరిని పోలీసులకు పట్టిం చాను’’ అని గుర్తుచేసుకొంది. ‘‘మగవాళ్లు చేసే సంజ్ఞలు న్యాయస్థానంలో రుజువు చేయడం కుదరదు. చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిని మహిళలు పట్టించుకొని ఫిర్యాదులు కూడా చేయరు’’ అని ఆమె ఎత్తిచూపింది. ‘‘ఫిర్యాదులు చేసిన సందర్భాల్లోనూ అనుమానం మహిళపైనే ఉంటుంది. ఆ అవమానం కూడా ఫిర్యాదుదారు భరించాల్సి వస్తుంది. అందుకే ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు సిద్ధపడడం లేదు’’ అని జామియామిలియా న్యాయ విభాగం ప్రొఫెసర్ మంజులా బాత్రా అన్నారు. 
 
 అడుగడుగునా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షల పట్ల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ మూడవ సంవత్సరం చదువుతున్న జేబా సైఫా మాట్లాడుతూ ‘‘విద్యార్థినుల వేషధారణ విషయంలో సహ విద్యార్థులైన అబ్బాయిల ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. ఆలోచనల్లో వక్రత్వం తప్ప రెచ్చగొట్టేది వేషధారణ కాదు. ఏదో సాకుతో యువతులు ధరించే దుస్తుల మీద కూడా హద్దులు పెట్టడం తప్ప ఇది మరేమి కాదు’’ అని అభిప్రాయపడింది. ‘‘దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు జరిగినా బస్సుల్లో వేధింపులు సాగుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో తెలిసేది కాదు. అయితే నిర్భయ మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న తరువాత వీరిని తిప్పి కొట్టడానికి సంసిద్ధత పెరిగింది. ఇప్పుడు దీటుగా జవాబివ్వగలుగుతున్నాను’’ అని సైఫీ చెప్పింది. ఈ సదస్సుకు హాజరయిన కొద్ది మంది విద్యార్థుల్లో ఒకడైన ఫర్హాన్ హయత్ మాట్లాడుతూ ‘‘మా తరగతిలో నలుగురమే అబ్బాయిలం. మిగ తా వారంతా అమ్మాయిలే. 
 
 ఫిజియోథెరపీ ప్రాక్టికల్స్‌లో అమ్మాయిలకు మేమే లక్ష్యమౌతుంటాం. తప్పుడు ప్రవర్తన అనేది ఇరుపక్షాల్లోనూ కనిపిస్తోంది’’ అని అభిప్రాయపడ్డాడు. అయితే బీహార్ దర్బంగా నుంచి వచ్చిన విద్యార్థి మహ్మద్ గుల్జార్ ఇక్బాల్ మరో కోణంలో సమస్యను వివరించాడు. ‘‘మనం బృందాలుగా వేరువేరుగా ఉన్నప్పుడు యథాలాపంగానే పలు వాఖ్యానాలు చేస్తాము. ఇవి తరచూ శృంగారానికి సంబంధించినవే అయి ఉంటాయి. మనం తొలుత మాట్లాడే బాషను గురించి  జాగ్రత్త తీసుకోవడం అవసరం’’ అని హయత్ సూచించాడు. విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు అంజలిగాంధీ మాట్లాడుతూ‘‘ యువతులు ధరించిన దుస్తుల గురించి మాట్లాడే హక్కు యువకులకు లేదు. వారు ధరించిన దుస్తులను బట్టి వక్ర దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆ హక్కు లేదు. ఎవరికి నచ్చిన తీరులో వారు దుస్తులు ధరించవచ్చు. ఉదాహరణకు సహాధ్యాయిని ఓ అమ్మాయి నోట్స్ అడిగినంత మాత్రాన ఆమె ఇష్టపడుతోందని ఉహించుకోవడం తప్పు. వారిని ఎక్స్‌రే కళ్లతో ఒళ్లంతా తడమడం అవసరం లేదు. ఇది కూడా ఒక రకమైన లైంగిక వేధింపే అవుతుంది’’ అని స్పష్టం చేసింది. సామాజిక సేవ విభాగం అధ్యాపకురాలై న అంజలి గాంధీ జామియామిలియా లైంగిక వేదింపుల నిరోధక కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘గుచ్చిగుచ్చి చూడడం, వెన్నాడడం, చొరవతీసుకోవడం, శృంగార సంబంధ వాఖ్యానాలు చేయడం వంటివి చేసేవారు తప్పనిసరిగా కష్టాల పాలవుతారు. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే విధంగా సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో కోట్ చేస్తే కూడా వారికి తిప్పలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. 
 
 లైంగికదాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో జరుగుతున్న జాప్యం పట్ల సదస్సు అగ్రహం వ్యక్తం చేసింది. ‘‘లైంగిక దాడులు చేసిన నేరస్తులను శిక్షించడానికి న్యాయవ్యవస్థలో అభ్యుదయకాముకులైన జడ్జిల అవసరం ఉంది. నేరస్తులను శిక్షించాల్సిన పరిస్థితిలో ధైర్యంగా వ్యవహరించి తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది’’ న్యాయ విభా గం ప్రొఫెసర్ మంజులా బాత్రా అన్నారు. శుక్రవారంనాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడాన్ని హర్షిం చారు. మహ్మద్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ‘‘జామియామిలియాతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో లింగ వివక్షత పట్ల అవగాహన సదస్సుల నిర్వహణ తప్పని సరిచేయాలి. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్నవి చిన్న బృందాలే అయినప్పటికీ సమాజం మీద పెద్ద ప్రభావం వేయగలుగుతాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. సదస్సు లో వక్తలు జామియాలో యాసిడ్ సంస్కృతి పట్ల ఎమాత్రం ఉపేక్షభావం ఉండదని స్పష్టం చేశారు.  
 
మరిన్ని వార్తలు