లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు

30 Sep, 2013 03:40 IST|Sakshi

కొప్పళ, న్యూస్‌లైన్ : ‘లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతాం..నాలో శక్తి ఇంకా పోలేదు, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌కు వలస వచ్చిన వారే అధికార పగ్గాలు చేపట్టిన ందున సమన్వయ సమితి రూపొందించారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం కొప్పళలో విలేకరులతో మాట్లాడారు.
 
అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయన్న సంగతి ఓటర్లకు తెలిసిందేనన్నారు. అయితే దీనినే కొన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకుంటున్నాయని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే సమన్వయ సమితి లేదని, అలాంటిది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా సమన్వయ సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు? అని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో అన్నీ సక్రమంగా లేవని అర్థమవుతోందన్నారు. వలస కాంగ్రెస్ వాదుల చేతిలో అధికార పగ్గాలున్నందునే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిని రూపొందించి ఉండవచ్చన్నారు.

గతంలో కాంగ్రెస్(ఐ) అని ఉండేదని, అది ఇప్పుడు కాంగ్రెస్(జే) అయ్యిందని హాస్యోక్తి విసిరారు. తమ పార్టీ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు అధికారం కల్పించి పెంచిన పార్టీ తమదన్నారు. తండ్రీ కొడుకుల పార్టీ అని ఏ ఓటరు, ప్రజలు చెప్పలేదన్నారు.  ఈ విషయంపై జరుగుతున్న దుష్ర్పచారం అంతా తమ ప్రత్యర్థి పార్టీల పనే అన్నారు. ఆ దేవుడి దయ వల్ల తనలో ఇంకా శక్తి ఉందని, వంట్లో చేవ ఉన్నంత వరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేది లేదని, తప్పకుండా పోటీ చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని 28 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు