అమరావతిలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్

25 Oct, 2016 19:15 IST|Sakshi

గుంటూరు: సినీ కళాకారులు, చిన్న నిర్మాతల మనుగడ కోసమే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చాంబర్ ఉపాధ్యక్షురాలు, సినీ నటి డి.కవిత చెప్పారు. ఏపీలో చాంబర్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్ద నిర్మాతల వల్ల హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అంతరించిపోతోందని అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలోని కొందరు పెద్దలు పెత్తనం చలాయిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్న కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం చాంబర్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. వైజాగ్‌లో ఫిలిం చాంబర్‌ను ఏర్పాటు చేయకుండానే ఫిలిం క్లబ్ నిర్మిస్తామని.. ప్రభుత్వాన్ని భూములను కోరడం వారి స్వార్థానికి నిదర్శనమని అన్నారు.

నవ్యాంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పెద్ద నిర్మాతలు వారి సొంత సొమ్ముతోనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. అధ్యక్షుడు, సినీ నిర్మాత ఎస్.వి.ఎన్.రావ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన తమ చాంబర్ ద్వారా స్థానిక కళాకారులు, నిర్మాతలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యాలయాన్ని లక్ష్మీపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్యదర్శి సాయిప్రసాద్, ట్రెజరర్ ఎస్.వి.తిరుమలరావ్, సభ్యులు డి.విజయభాస్కరరెడ్డి, తోట కృష్ణ, కె.త్రినాథ్, డి.రవికుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు