ఎడిటర్ కిషోర్ ఇకలేరు

8 Mar, 2015 08:14 IST|Sakshi

 తమిళసినిమా: సినీ ఎడిటర్ కిషోర్ (37) శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈరం చిత్రం ద్వారా ఎడిటర్‌గా పరిచయం అయిన కిషోర్ ఆడుగళం, పయనం, కాంచన, ఆరోహరణం, ఎంగేయుం ఎప్పోదుం, పరదేశి, ఎదిర్ నీశ్చల్ వంటి విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ఆడుగళం చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ మధ్య విచారణై చిత్రానికి పని చేస్తుండగా అనూహ్యంగా స్పృహ కోల్పోవడంతో వెంటనే వడపళనిలోని విజయా ఆసుపత్రిలో చేర్చారు. కిషోర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడుకు చేరే నరం మూసుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆయనకి శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వారానికి పైగా కోమాలో ఉన్న కిషోర్ శుక్రవారం కన్నుమూశారు.
 
 అవయవదానం: కిషోర్ శరీరంలోని అవయవాలను ఆయన తల్లిదండ్రులు దా నం చేయడానికి అంగీకరించారు. దీంతో నగరంలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి అవయవదానం చేశారు. శుక్రవారం రా త్రి 11 గంటలకు ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా కిషోర్ హృదయం, కళ్లు, కాలేయం తదితర అవయవాలను వేరు చేసి శనివారం ఉదయం పార్థివ దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కిషోర్ భౌతిక కాయాన్ని స్థానిక సాలిగ్రామంలోని ఆయన ఎడిటింగ్ రూమ్ వద్ద సినీ వర్గాలు దర్శనార్థం ఉంచారు. శనివారం సాయంత్రం ఆయన సొంత ఊరు విల్లుపురం జిల్లా వళువసూరు గ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కిషోర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కిషోర్ భౌతిక కాయానికి ఎడిటర్ మోహన్, వెట్రిమారన్, ఎస్‌పీ జోనదన్, సర్గుణం, వేల్‌రాజా, దురై సెంథిల్‌కుమార్, ఎంగేయుం ఎప్పోదుం శరవణన్, ధరణి, ఎస్.ఎళిల్, జి.వి.ప్రకాష్‌కుమార్, శివకార్తికేయన్, సుబ్రమణి శివ, పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిం చారు.
 

మరిన్ని వార్తలు