ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

22 Sep, 2016 11:20 IST|Sakshi
సీతంపేట : తెలుగు టాకీ సినిమా 85 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పౌరగ్రంథాలయంలో బుధవారం ప్రారంభమయింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉత్సవాలను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాకు ప్రాణం పోసి, సినిమా అభివృద్ధికి త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులను గుర్తుపెట్టుకోవడంలో మనం విఫలమయ్యామన్నారు. భక్తప్రహ్లాద తొలి తెలుగుటాకీ సినిమాగా సెప్టెంబర్‌ 15, 1931లో విడుదలైనపుడు సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించిన హెచ్‌.ఎం.రెడ్డిని అందరూ ఎంతో అభినందించారన్నారు. నేడు అలాంటి మహనీయులను మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా 1939లో నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విశాఖ ఫిల్మ్‌ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, సహాయ కార్యదర్శి పి.వి.రమణ, రచయిత డి.వి.సూర్యారావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు