బతుకులు బుగ్గిపాలు

22 Aug, 2014 00:38 IST|Sakshi
బతుకులు బుగ్గిపాలు

 చెన్నై, సాక్షి ప్రతినిధి: పేదల కాయకష్టమే ప్రధాన పెట్టుబడిగా రాజకనీ ట్రేడర్స్ అనే సంస్థ చెన్నై శివార్లు ఆవడి-పూందమల్లి హైరోడ్డులోని కాడువెట్టి గ్రామంలో ఐదేళ్ల క్రితమే ఏర్పాటైంది. వీధి వీధినా తిరుగుతూ పాత సామాన్లు కొనేవారు, చెత్తకుప్పల్లో వస్తువులను సేకరించే వారి నుంచి ప్లాస్టిక్ సామాన్లు కొనడం, వాటిని హోల్‌సేల్‌గా ప్లాస్టిక్ వస్తువుల తయారీ కంపెనీలకు విక్రయించే వ్యాపారం అక్కడ సాగుతోంది. తిరుచెందూరుకు చెందిన ఇమ్మానుయేల్ (36) ఈ సంస్థద్వారా బాగా ఆర్జించినట్లు సమాచారం. అయితే వ్యాపారానికి తగినట్లుగా కంపెనీ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టలేదు. తాత్కాలికమైన రేకుల షెడ్డు, లోన కొన్ని గదులతో వ్యాపారం సాగించేవారు.
 
 కంపెనీలో పనిచేస్తున్న 25 మందిలో నగరానికి చెందిన 20 మంది విధులు పూర్తి కాగానే ఇళ్లకు వెళ్లిపోతారు. ఒడిశాకు చెందిన ఇద్దరు, తిరుచందూరు ఇద్దరు, కాంచీపురానికి చెందిన ఒకరు రాత్రి వేళల్లో అక్కడ తలదాచుకుంటున్నారు. ఎప్పటి లాగానే పనులు ముగిసిన తరువాత బుధవారం రాత్రి లోన గడియపెట్టుకుని ఐదుగురు రెండు గదుల్లో నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అటువైపు వెళుతున్న ఒక వ్యక్తి ప్లాస్టిక్ కంపెనీ నుంచి నల్లని పొగలు రావడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి కంపెనీ తలుపులు బాదడంతో మెళకువ వ చ్చిన తూత్తుకూడికి చెందిన చిత్రవేల్ (30) వెలుపలకు పరుగులు తీశాడు. మరో గదిలో నలుగురు యువకులు నిద్రిస్తున్నట్లు అతను చెప్పాడు.
 
 పూందమల్లి, ఆవడి, గిండీ, అశోక్‌నగర్, అంబత్తూరు, కోయంబేడు ప్రాంతానికి చెందిన 15 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడం ప్రారంభించాయి. సుమారు 3 గంటల పాటు పోరాడి మంటలను ఆర్పివేశారు. రెండో గదిలోకి వెళ్లి చూడగా నలుగురు యువకులను కాలిబూడిదైన స్థితిలో కనుగొన్నారు. మృతులను ఒడిశాకు చెందిన అమర్ (24), రాజా (26), తిరుచందూరుకు చెందిన రఘు (26), కాంచీపురానికి చెందిన శరత్‌కుమార్ (24)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో అదే ప్రాంగణంలో నిలిపి ఉన్న కారు సైతం కాలిబూడిదైంది. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో నాలుగు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు.
 
 రాజకనీ ట్రేడర్స్ కంపెనీ పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో రాత్రి వేళలో చెత్తకుప్పను కాలుస్తారు. బుధవారం రాత్రి కూడా ఇలా కాల్చిన కుప్పల్లోని నిప్పు రవ్వలు ప్లాస్టిక్ వస్తువులపై పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. లేదా దోమల నివారణకు అక్కడి కార్మికులు వెలిగించిన ఒత్తుల నుంచి నిప్పు పుట్టిందని అంటున్నారు. నిప్పును సులభంగా ఆకర్షించే గుణం కలిగిన ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాద నివారణ జాగ్రత్త చర్యలు చేపట్టలేదని తేలింది. అంతేగాక అగ్నిమాపకశాఖ ద్వారా ఎన్‌ఓసీ పొందకుండా కంపెనీని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఇమ్మానువేల్ (36)ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు