మాధవరంలో భారీ అగ్ని ప్రమాదం; పది లారీలు దగ్ధం

1 Mar, 2020 07:59 IST|Sakshi
రసాయన గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు

సాక్షి, చెన్నై: మాధవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ అగ్నిజ్వాల పక్కనే ఉన్న మరో గోడౌన్‌ను సైతం చుట్టుముట్టింది. ఆ పరిసరాల్లో ఆగి ఉన్న పది లారీలు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో ఆ పరిసరాలు నిండడంతో శ్వాస సమస్యతో జనం తల్లడిల్లాల్సిన పరిస్థితి. ఈ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. చెన్నై శివార్లలోని మాధవరం పరిసరాలు గోడౌన్లు, పలు చిన్న తరహా పరిశ్రమతో నిండి ఉంటాయి. ఇక్కడే ఇటీవల సబర్బన్‌ బస్‌ టెర్మినల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వైపుగా వెళ్లే అన్ని బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. మాధవరం జంక్షన్‌లో సబర్బన్‌ బస్‌ టెర్మినల్‌ ఉండగా, దానికి వెనుక కూత వేటు దూరంలో ఉన్న రసాయన పరిశ్రమలో హఠాత్తుగా శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన బయలు దేరింది.

సమచారం అందుకున్న మాధవరం, తిరువొత్తియూరు, చెన్నై, తిరువళ్లూరుల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే పనిలో పడ్డాయి. ఐదు వందల మంది మేరకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. నీళ్లు ఎంతగా చల్లుతున్నా, మంటలు అదుపులోకి రాక పోవగా, ఉవ్వెత్తున ఎగసి పడతుండడంతో ఆందోళన తప్పలేదు. ఆ గోడౌన్‌కు రెండు వందల మీటర్ల వరకు వేడి సెగ తాకడంతో సమీపంలోకి వెళ్లలేని పరిస్థితిల్లో అగ్నిమాపక సిబ్బంది వెనక్కి రావాల్సిన వచ్చింది. చివరకు మెట్రో వాటర్‌ బోర్డుకు చెందిన పది లారీల ద్వారా నీటిని తరలించారు.

ఆ పరిసరాల్లో వేడిసెగ మరింతగా బయలుదేరకుండా, పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినా, ఆ గోడౌన్‌కు పక్కనే ఉన్న మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అక్కడున్న పది లారీలు దగ్ధమయ్యాయి. ఆ గోడౌన్లో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ రసాయన పరిశ్రమలో ఎంతకు మంటలు అదుపులోకి రాక పోవడంతో రెస్క్యూ కొనసాగుతోంది. ఓ దశలో మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి వేయాల్సిన అవశ్యం తప్పదన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే, అందుకు అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు.  చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు; నలుగురికి గాయాలు


వంద కోట్ల విలువగల రసాయనాలు... 
మాధవరంలో అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్‌లో వంద కోట్లు విలువగల రసాయనలు ఉన్నట్టు తేలింది. ఈ రసాయనాల మూడి పదార్థాలు వైద్య సంబంధిత మందుల తయారీలో ఉపయోగించనున్నారు. ఇక్కడ మూడు గోడౌన్లు ఉండగా, తొలి గోడౌన్, రెండో గోడౌన్‌లలో తొమ్మిదిన్నర గంటల సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే, మూడో గోడౌన్‌లోనేఅ త్యధికంగా మందులు ఉండటంతో, మంటల్ని అదుపు చేయడానికి తీ›వ్రంగా శ్రమిస్తున్నారు. ఆ గౌడౌన్‌ యజమాని రంజిత్‌ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆయన వద్ద పోలీసులు విచారిస్తున్నారు.

కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టెట్రా కార్బన్, డై సల్పయిడ్‌ వంటి 24 రకాల రసాయానాలు వందలాది బేరల్స్‌లో ఇక్కడ ఉన్నట్టు విచారనలో తేలిందని అగ్నిమాపక శాఖ డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు. అందుకే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు. స్కై లిఫ్ట్‌ వాహనాల్ని రంగంలోకి దించడం ద్వారా రెండు గోడౌన్లలో మంటలు అదుపులోకి వచ్చాయని, మరో గోడౌన్‌లో మంటలు అర్థరాత్రి లేదా ఆదివారం వేకువ జామున అదుపులోకి తెస్తామన్నారు. ఎల్‌ఈడీ విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేసి, అగ్ని జ్వాల ఎక్కడి నుంచి ఎ గసి పడుతున్నదో గుర్తించి, దానిని ఆర్పే యత్నం చేస్తున్నామన్నారు.  చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!

జనం అవస్థలు... 
ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలకు తోడుగా, దట్టమైన పొగ ఆ పరిసరాల్ని చుట్టుముట్టింది. దీంతో ఆ గౌడౌన్‌కు సమీపంలో ఉన్న వాళ్లందర్నీ ఖాళీచేయించారు. అయినా, పొగ క్రమంగా వ్యాపించడంతో ఆ పరిసర వాసులు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే, కళ్లు మంటలు పెరగడంతో ఆందోళన తప్పలేదు. ఆగమేఘాలమీద వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రమాదం కారణంగా సమీపంలో ఉన్న బస్‌ టెర్మినల్‌ ఉన్న బస్సుల్ని అక్కడి నుంచి అప్రమత్తం చేశారు.

ప్రయాణికుల్లో సైతం ఆందోళన బయలుదేరడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆపరిసర మార్గాలన్నీ ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ డీజీపీ శైలేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ మంటల్ని ఆర్పేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో ప్రమాద జరిగినప్పుడు ఆ రసాయన గోడౌన్‌లో ఎవరైనా ఉన్నారా అన్న ఆందోళన బయలుదేరడంతో ఉత్కంఠ తప్పడం లేదు.

మరిన్ని వార్తలు