టాబ్లెట్ భాగ్య

25 Jan, 2015 02:08 IST|Sakshi
టాబ్లెట్ భాగ్య

దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీ
ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 

బెంగళూరు : రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే దిశగా వారికి టాబ్లెట్‌లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. శనివారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-ట్యాబ్‌లను సిద్ధరామయ్య ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీని తీసుకెళ్లేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోగాత్మకంగా బాగల్‌కోట, విజయపుర జిల్లాలోని 1,500గ్రామాల్లోని రైతులకు టాబ్లెట్‌లను అందజేయనున్నారు.

టాబ్లెట్‌లలో ఏయే సౌకర్యాలు....

రైతులకు అందజేయనున్న ఈ టాబ్లెట్‌లో 8జీబీ మెమొరీ, 1జీబీ ర్యామ్, వైఫై, అత్యాధునిక కెమెరా సౌకర్యాలను పొందుపరిచారు. టాబ్లెట్‌లకు నెట్‌వర్క్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మూడు నెలల పాటు టాబ్లెట్‌కు ఎయిర్‌టెల్ సంస్థ ఉచిత డాటా సౌకర్యాన్ని అందించనుంది. మూడు నెలల అనంతరం రైతులు ఇంటర్నెట్ సౌకర్యం కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టాబ్లెట్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలను రైతులు తెలుసుకోవచ్చు. ఏయే పంటలకు ఎలాంటి రసాయనాలు వాడాలి, వాతావరణ పరిస్థితులు, వర్ష సూచనలు, ఏయే పంటలకు ఎలాంటి చీడలు పట్టే అవకాశం ఉంది? వాటి నివారణ మార్గాలేంటి తదితర అన్ని వివరాలను ఈ టాబ్లెట్‌లో పొందుపరిచారు.
 

టాబ్లెట్ నుంచే సహాయవాణి కేంద్రానికి సమాచారం....

ఈటాబ్లెట్‌లో ఏర్పాటు చేసిన ఓ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయవాణి కేంద్రానికి సందేశం వెళుతుంది.  ఈ టాబ్లెట్‌లోని కెమెరా సహాయంతో పంట పరిస్థితిని ఫొటోలు తీసి సహాయవాణి కేంద్రానికి పంపవచ్చు. అనంతరం సహాయవాణి కేంద్రంలోని వ్యవసాయ రంగ నిపుణులు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను అందజేస్తారు. అంతేకాదు అవసరమైతే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి పంటకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేస్తారు.
 అత్యాధునిక టెక్నాలజీని చేరువ చేసేలా : ఎస్.ఆర్.పాటిల్

కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ....అత్యాధునిక టెక్నాలజీని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సైతం చేరువ చేసేలా దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పధకాన్ని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రెండుజిల్లాలోని 1,500 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం సత్ఫలితాలను ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు