జాలర్లూ...జాగ్రత్త!

20 Nov, 2013 03:16 IST|Sakshi

 సాక్షి, చెన్నై: చేపల వేటకు వె ళ్లొద్దని జాలర్లకు వాతావరణ కేంద్రం సూచించింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. పంబన్, కడలూరు, పుదుచ్చేరి హార్బర్లలో మంగళవారం ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. చెన్నైకు ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో నాలుగు రోజులుగా ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. అయితే, బంగాళా ఖాతంలో ఏర్పడిన మరో ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది మరింతగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో సముద్ర తీర జిల్లాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని సేకరిస్తూ, అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 
 ఎగిసిపడుతున్న కెరటాలు: వాయుగుండం ప్రభావంతో బుధవా రం నుంచి దక్షిణాది జిల్లాల్లో మోస్తారుగాను, సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో కెరటాలు క్రమంగా ఎగసిపడుతూ వస్తున్నాయి. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జాలర్లను సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన వాళ్లు బుధవారం సాయంత్రంలోపు తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నారు. ఒడ్డున ఉండే పడవల్ని భద్ర పరచుకోవాలని కోరుతున్నారు. అలలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం పంబన్, కడలూరు, పుదుచ్చేరి హార్బర్‌లలో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు.
 
 కరుణించని ఈశాన్యం
 ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది కంటే పరిస్థితి అధ్వానంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో గతంలో కంటే 29 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, బంగాళా ఖాతంలో తరచూ ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో నెల రోజులుగా వర్షాలు అధికంగా పడ్డాయని చెబుతున్నారు.  
 

మరిన్ని వార్తలు