బాణసంచా పేలుడులో ఐదుగురు మృతి

27 Dec, 2016 02:04 IST|Sakshi

బాణసంచా పరిశ్రమలో మళ్లీ పేలుడు చోటు చేసుకుంది. సాత్తూరులోని పరిశ్రమలో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు బలి అయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.

సాక్షి, చెన్నై: విరుదునగర్‌ జిల్లా బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి శివకాశి మినీ జపాన్‌గా పేరు గడించింది. ఇక్కడ బాణసంచా తయారీలో నిమగ్నం అయ్యే కార్మికులకు దినదిన గండమే. ఎప్పడు ఏ పరిశ్రమలో పేలుడు చోటు చేసుకుంటుందోనన్న ఆందోళన ఆ పరిసరవాసుల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సాత్తూరు సమీపంలోని దైవపాండికి చెందిన పరిశ్రమలో పేలుడు ఆ పరిసరవాసుల్ని ఆందోళనలో పడేసింది. విరుదునగర్‌ జిల్లా సాత్తూరు ముత్తాండిపురంలో దైవ పాండికి చెందిన పరిశ్రమ ఉంది. ఇక్కడ వంద మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. ఉదయం యథా ప్రకారం సిబ్బంది విధులకు వెళ్లారు. వారికి కేటాయించిన గదుల్లో బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మూడో నెంబరు గదిలో ముడి పదార్థాలను సిద్ధం చేస్తున్న సమయంలో చెలరేగిన నిప్పు రవ్వలు పెను ప్రమాదానికి దారి తీశాయి. అక్కడ సిద్ధం చేసిన బాణసంచా పేలడంతో ఆ పరిసరాల్లో ఆందోళన నెలకొంది. ఇతర గదుల్లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

 ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. పేలుడు శబ్దంతో ఆ పరిసరాలకు చెందిన జనం పరుగులు తీశారు. అయితే లోనికి వెళ్లేందుకు సాహసించ లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఈ పేలుడు దాటికి మూడు నెంబరు గది నేలమట్టమైంది. ఇక్కడి మంటలు ఇతర గదులకు వ్యా పించని దృష్ట్యా, మరింత పెను ప్రమా దం తప్పినట్టు అయింది. సంఘటనా స్థలంలోనే ఎలుమచ్చం పట్టికి చెందిన మునియాండి భార్య సరస్వతి(44), మునుస్వామి భార్య సుబ్బుతాయ్‌(55), మాడస్వామి భార్య సెల్వి(25) మరణించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ముత్తుమారి, మునిరాజ్, సూర్యనారాయణ, సెల్వం, వీరమ్మలను చికిత్స నిమిత్తం సాత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంతో అధికార వర్గాలు సాత్తూరుకు ఉరకలు తీశాయి. ప్రమాద ఘటనపై విచారణ సాగిస్తున్నాయి. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

మరిన్ని వార్తలు