బేగంపుర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురి దుర్మరణం

11 Nov, 2014 00:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బేగంపుర్‌లోని పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుఝామున జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వారిలో నలుగురు పిల్లలని పోలీసులు తెలిపారు. ఊపిరాడక వారు మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని బేగంపుర్ పేపర్ ప్లేట్లఫ్యాక్టరీలో తెల్లవారుఝామున 2.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. తమకు 3.14 గంటలకు సమాచారం అందగానే 18 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి పంపించామని అగ్నిమాపక విభాగం తెలిపింది.

ఉదయం ఆరు గంటలకు మంటలు పూర్తిగా చల్లారాయని పేర్కొంది. రెండు గదుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న ఐదుగురు ఊపిరాడక మరణించారని పోలీసులు చెప్పారు. మరణించినవారిని  శ్రవణ్‌కుమార్ (17), నిరంజన్ (5), నీలేష్ (11), నితిన్ (26), శివం (15) గా గుర్తించారు. మరణించిన వారందరూ బీహార్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ పింటూషా అనే అతనికి చెందిందని, అతని కుమారుడు నిరంజన్ కూడా మరణించాడని వారు తెలిపారు. మిగతావారు కూడా షా బంధువులేనని వారు తెలిపారు, ప్రమాదం జరిగిన సమయంలో పింటూ షా తన అద్దె ఇంట్లో నిద్రపోతున్నాడని, ఆ ఇల్లు ఫ్యాక్టరీకి కొద్ది మీటర్ల దూరంలో ఉందని వారు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు