వరుస పేలుళ్లకు ఐదేళ్లు

14 Sep, 2013 00:18 IST|Sakshi
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అత ని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ల అరెస్టు నేపథ్యం లో వ రుస బాంబు పేలుళ్ల కేసులో ఇతర నిందితులను పట్టుకోగలుగుతామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్నారు. 2008, సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం నగరంలోని కన్నాట్‌ప్లేస్, బారాఖంబారోడ్, గఫార్ మార్కెట్, గ్రేటర్ కైలాశ్ తదితర ప్రాంతాల్లో ఐదు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 26 మంది చనిపోగా 133 మంది గాయపడిన సంగతి విదితమే. ఇక కన్నాట్‌ప్లేస్, రీగల్ సినిమా, ఇండియా గేట్‌ల వద్ద పేలని బాం బులు లభించాయి. భత్కల్, అసదుల్లాలతో కలిపి ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు మొత్తం 16 మంది నిందితులను అరెస్టుచేశారు. 
 
 మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది. న్యాయస్థానంలో దాఖలుచేసిన అభియోగపత్రం లోనూ పోలీసులు వీరిరువురి పేర్లు చేర్చారు. ఈ కేసు విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భత్కల్‌నుంచి మరింత సమాచారం లభించొచ్చంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. కుట్రదారుల పేర్లు కూడా బయటికొచ్చే అవకాశముందన్నారు. గఫార్ మార్కెట్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన మీరాదేవి అనే మహిళ జీవితంలో పెనువిషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ఆమె నలుగురిని కోల్పోయింది.  ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ఓ రావి చెట్టు కింద మంచం వేసుకుని కాలం గడుపుతున్న మీరా ఇప్పటికీ ఆనాటి ఘటనను మరిచిపోలేకపోతోంది. ఆనా టి పేలుడు ఘటనలో ఆమె అల్లుడు హర్షన్, కుమార్తెలు సరోజ, పూజ. మనవడు అశోక్‌లు చనిపోయా రు. ఆనాటి ఘటన గురించి మాట్లాడుతూ ‘ఆ రోజు కూడా ఈ రావి చెట్టు కిందే కూర్చున్నా. సరోజ బతిమిలాడుతుండడంతో స్నానం చేసేందుకు లోపలికెళ్లా. అంతలోనే చెవులు పగిలిపోయేలా శబ్దం వినిపించింది. 
 
 భూకంపం వచ్చిందేమోనని అనుకున్నా. స్నానంచేసిన తర్వాత బయటికి రాగా శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పింది. దేవుడా నన్ను మాత్రం ఎందు కు తీసుకెళ్లలేకపోయావంటూ రోదించానని తెలి పింది. సొంత బిడ్డలకంటే ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తన అల్లుడిని ఎందుకు తీసుకు పోయావు దేవుడా అంటూ గద్గద స్వరంతో పలి కింది. కుటుంబసభ్యులంతా చనిపోయిన తర్వాత మీరా జీవితం అస్తవ్యస్తమైపోయింది. జీవనం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు 60 ఏళ్ల భగవతి అనే నగరవాసిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. కార్యాలయం నుంచి తిరిగొచ్చిన తన పెద్దకుమారుడు గంగా ప్రసాద్ అలి యాస్ బిల్లు టీ పెట్టమ్మా కాసేపాగి మళ్లొస్తా అంటూ బిల్లు బయటికెళ్లాడు. బిల్లు బయటికెళ్లిన కాసేపటి తరువాత భీకర శబ్దం వినిపించిందని భగవతి తెలిపింది. తాము ఉండే ప్రాంతమంతా పొగతో నిండిపోయిందని చెప్పింది. ఈ ఘటనలో గంగాప్రసాద్ చనిపోయాడు. చిన్నకుమారుడి తలకి గాయాల య్యాయని, అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపింది.
 
మరిన్ని వార్తలు