ముంబైపై ముష్కరుల దాడికి ఐదేళ్లు చెదిరిన జ్ఞాపకాలు

23 Nov, 2013 23:17 IST|Sakshi

ముంబై:  పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు నగరంపై విరుచుకుపడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఘటన చోటుచేసుకుని మరో రెండు రోజుల్లో ఐదేళ్లు కానుంది. ఈ దాడులు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే ఆనాటి ఈ పీడకల నగరవాసుల జ్ఞాపకాలనుంచి దాదాపు చెదిరిపోయింది. ఏడాదికొకసారి మృతుల స్మారకార్థం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని ప్రసా ర మాధ్యమాలు ప్రజలకు చేరవేయడం జరుగుతోందే తప్ప నగరవాసులు మాత్రం తమ తమ దైనందిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆనాటి దాడి ఘట నలో మొత్తం 166 మంది చనిపోగా. మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ నెల 26వ తేదీ (దాడి జరిగిన రోజు) సమీపిస్తుండడంతో ఆనాటి పీడకల మరికొందరి మదిలో మిణుకుమిణుకుమంది. ఈ విషయమై విలేపార్లే ప్రాంతంలో నివసించే సాఫ్ట్‌వేర్ కన ్సల్టెంట్ దుకుల్ పాండ్యా మాట్లాడుతూ ఆనాటి ఘటన అత్యంత విచారకరమన్నారు. అసలు ఆవిధంగా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఏదిఏమైనప్పటికీ నగరవాసులంతా గతం మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి సారించి ముందుకు సాగాలని ఆ రాత్రంతా మెలకువతో ఉండి టీవీలో వస్తున్న దృశ్యాలను తిలకిస్తూ కాలం గడిపిన పాండ్యా పేర్కొన్నాడు. ఇదే విషయమై బోరివలికి చెందిన కె.ఎస్.మీనాక్షి మాట్లాడుతూ అదొక జాతీయ విషాదమన్నారు. దీని సంగతి అలాఉంచితే ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరల పెరుగుతుండడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున ్న సమస్యలతోపాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు నగరవాసులు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 26/11 వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడ్డారు. అంతకుముందు పాకిస్థాన్ సముద్ర తీరాన్ని దాటివచ్చిన వీరంతా నవంబర్ 26వ తేదీ సాయంత్రం ప్రశాంతంగా దేశరాజధానిలోకి అమాయకుల మాదిరిగా అడుగుపెట్టారు.  కొలాబా తీరాన దిగిన వీరంతా ఒక క్రమపద్ధతితో రెండు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు.
 
వీరిలో అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్  దిశగా ముందుకు సాగారు. అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్   అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు, ఇస్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు తొలుత నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌వైపు, ఆ తర్వాత కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలన్నీ అత్యంత ఇరుకైన దక్షిణ ముంబైలో కేవలం ఐదుకిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అక్కడ బ్యూరోక్రాట్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తారు.  

అంతేకాకుండా ప్రభుత్వ అధికార నివాసాలు, మంత్రుల నివాసాలు కూడా అక్కడే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసకాండకు దిగినట్టు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగిన నగర పోలీసులు, సైనిక బలగాలు, నౌకాదళ కమాండోలు, ఇతర పారామిలిటరీ బల గాలు 50 గంటల సుదీర్ఘ పోరాటం జరిపి 22 ఏళ్ల కసబ్ మినహా మిగతా వారందరినీ హతమార్చాయి. ఇక నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద  పోలీసులు అజ్మల్ ఆమిర్ కసబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్  తదితర ప్రాంతాల్లో సంచరించిన ఈ ఉగ్రవాద బృందం నర మేధానికి పాల్పడింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే విలేపార్లే ప్రాంతంలో తాము ఎక్కిన కారును బాంబులతో పేల్చివేసింది.

 సజీవంగా దొరికిపోయిన క సబ్‌ను పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఈ విచారణలో దాడులకు ప్రత్యక్ష, పరోక్ష కారకులైన 35 మంది పేర్లను కసబ్ పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్  ఉజ్వల్ నికం తన వాదనలను సమర్థంగా వినిపించారు. దీంతో కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ దిగువకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కసబ్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ సవాలుచేశాడు. రెండుచోట్లా చుక్కెదురైంది. తనకు క్షమాబిక్ష పెట్టాలంటూ కసబ్ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. దానిని కూడా రాష్ర్టపతి తిరస్కరించడంతో పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో గత ఏడాది నవంబర్ 21వ తేదీన కసబ్‌ను ఉరితీసిన సంగతి విదితమే.
 

>
మరిన్ని వార్తలు