-

పంచముఖ పోటీ

1 Nov, 2016 03:49 IST|Sakshi

రంగంలోకి డీఎండీకే  
రేపటితో నామినేషన్లు ఆఖరు

తమిళనాడులో ముచ్చటగా మూడుచోట్ల సాగుతున్నఉప ఎన్నికల్లో డీఎండీకే కూడా బరిలోకి దిగింది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ అభ్యర్దులకు డీఎండీకే కూడా ప్రత్యర్దిగా మారడంతో చతుర్ముఖ పోటీకాస్తా పంచముఖ పోటీగా మారింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన మేలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై తంజావూరు, అరవకురిచ్చిలో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనవేల్ మృతితో తిరుప్పరగున్రం నియోజవర్గం కూడా ఖాళీ అయింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఈనెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే, డీఎంకే పోటీపడుతుండగా, బీజేపీ, పీఎంకేలు ఆయా  నియోజకవర్గాల్లో తమ బలమేంటో తెలుసుకునేందుకు బరిలోకి దిగుతున్నాయి.

గత నెల 26వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఈనెల 2వ తేదీతో గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికల వేడి రాజుకుని నాలుగు పార్టీలు అభ్యర్థుల జాబితాను వెల్లడించే వరకు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిన డీఎండీకే గత నెల 30వ తేదీన అకస్మాత్తుగా తాము పోటీచేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలు పంచముఖ పోటీగా మారాయి. ఈనెల 2వ తేదీన పీఎంకే, డీఎండీకే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉప ఎన్నికల్లో తాము పోటీచేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ సోమవారం ప్రకటించారు.

వర్షపు హోరులోనూ జోరుగా ప్రచారం  
పోలింగ్ సమయం సమీపస్తుండగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకేల మధ్య విమర్శల వేడి రాజకుంది. మధురైలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మంత్రులు సెల్లూరురాజా, ఉదయకుమార్ తదితరులు కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయేలా అన్నాడీఎంకే అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో విజయాన్ని చేకూర్చాలని మంత్రులు అన్నారు. తిరుప్పరగున్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే అభ్యర్థులపై అత్యధిక ఓట్ల తేడాతో తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.  ముఖ్యమంత్రి లేని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్జీవంగా మారిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు