ఆహార చట్టాన్ని అనుమతించం : ముఖ్యమంత్రి జయలలిత

5 Aug, 2013 23:47 IST|Sakshi
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆహార భద్రతా చట్టాన్ని ఎంతమాత్రమూ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. చట్టం తీరుపై కేంద్రాన్ని, దీనికి మద్దతు పలికిన డీఎంకే అధినేత కరుణానిధిని ఆమె దుయ్యబట్టారు. ఆహార భద్రతా చట్టమంతా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. అరుుతే చట్టం రూపకల్పనను లోతుగా విశ్లేషిస్తే మూడేళ్ల తర్వాత బియ్యం కిలో రూ.20 లెక్కన పేదలు కొనుగోలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై వేలకోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని హడావుడిగా ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు.
 
 రెండు నాల్కల కరుణ
 తమిళ ప్రజలను పీక్కుతినగల ఆహార భద్రతా చట్టంపై డీఎంకే అధినేత కరుణానిధి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని జయలలిత దుయ్యబట్టారు. ఈ ఏడాది మార్చిలో యూపీఏకు డీఎంకే గుడ్‌బై చెప్పినప్పుడు కేంద్రానికి బయట నుంచి మద్దతిస్తారా అని మీడియా ప్రతినిధి కరుణను ప్రశ్నించారన్నారు. ఎంతమాత్రం లేదని కరుణ సమాధానం ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆహార భద్రతా చట్టం అమలులో ఉన్న అనేక సాదక బాధకాలపై తమ సభ్యు లు పార్లమెంటులో నిలదీస్తారని పేర్కొన్నారన్నారు. ఇందుకు తగినట్లుగా టి.ఆర్.బాలు తదితర సభ్యులు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసినట్లు పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయని తెలిపారు. 
 
 అయితే అకస్మాత్తుగా డీఎంకే పార్లమెంటు సభ్యులు ఇళంగోవన్ ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తుతిస్తూ ప్రసంగించారన్నారు. కరుణ సైతం ఇది చాలా మంచి చట్టమని పొగుడుతూ మద్దతు పలకబోతున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ చట్టం ఆమోదానికి అండగా నిలవడం ద్వారా కరుణ తన రెండు నాల్కల ధోరణి చాటుకున్నారని జయ వ్యాఖ్యానించారు. అంతేగాక చట్టాన్ని స్వాగతించడం ద్వారా తమిళులకు ఆయన ద్రోహం చేశారని విమర్శించారు. తాను మాత్రం అభ్యంతరం పలుకుతూ ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. లోపభూయిష్టమైన ఆహార భద్రతా చట్టాన్ని తమిళనాడుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జయలలిత సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని వార్తలు