జల్లికట్టుకు పట్టు

10 Jan, 2017 02:17 IST|Sakshi

విపక్షాల ఆందోళనలు
►  ప్రత్యేక చట్టం తేవాలని పీఎంకు సీఎం లేఖ
నిషేధాన్ని అతిక్రమిస్తామని సవాళ్లు


సాక్షి ప్రతినిధి, చెన్నై: సంక్రాంతి పండుగ సమీపించడంతో జల్లికట్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పొంగల్‌పండుగ సందర్భంగా జల్లికట్టు జరిగి తీరాలని కోరుతూ రాజకీయ పార్టీలన్నీ పోరుబాటపట్టాయి. జల్లికట్టు అభిమానులు సైతం జల్లికట్టు జరుపుతామని  ఘంటాపథంగా చెబుతున్నారు. జల్లికట్టు కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. తమిళుల పారంపర్య సంప్రదాయ క్రీడైన జల్లికట్టును ఈ ఏడాది నిర్వహించే తీరాలని అధికార అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. జల్లికట్టు క్రీడకు పేరొందిన అలంగానల్లూరులో ఈనెల 3వ తేదీన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్  ఆందోళన నిర్వహించారు. మదురైలో ఎండీఎంకే   ప్రధాన కార్యదర్శి వైగో, తమిళనాడు మాని ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్ ఆందోళన చేపట్టారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌ సోమవారం అలంగానల్లూరు వెళ్లి జల్లికట్టు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. జల్లికట్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సభలో నినాదాలను లేవనెత్తారు.

విద్యార్థులు, పలు సంఘాలకు చెందిన యువకులు మదురైలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని అతిక్రమించి క్రీడను నిర్వహిస్తామని నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షులు సీమాన్  స వాల్‌ చేశారు. జల్లికట్టు ముగిసే వరకు ఎవ్వరినీ అరెస్ట్‌ చేయరాదని సీఎంను కోరారు. జల్లికట్టు వంటి క్రీడను విదేశాల్లో బుల్‌ఫైట్‌ పేరుతో నిర్వహిస్తుంటారని నటుడు కమల్‌హాసన్  అన్నారు. అనేక దేశాల్లో ఎద్దులను మాంసంగా మారుస్తున్నా, భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో జల్లికట్టు ముగి సిన తరువాత వాటిని చక్కగా పోషిస్తారని పేర్కొంటూ సమర్థించారు.

పీఎంకు సీఎం పన్నీర్‌ లేఖ: తమిళుల వంశపారంపర్య జల్లికట్టు క్రీడను యథావిధిగా నిర్వహించుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం లేఖ రాశారు. పొంగల్‌ పండుగ దినాల్లో సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అయితే 2014 మే 7వ తేదీన సుప్రీంకోర్టు నిషేధం విధించడం తమిళులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం అనేకసార్లు కేంద్రానికి ఉత్తరం రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. జల్లికట్టు జరుపుకునేలా కేంద్రం ఒక అత్యసవర చట్టాన్ని తీసుకురావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు