గణతంత్రం..భద్రత కట్టుదిట్టం!

21 Jan, 2014 00:26 IST|Sakshi

 సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పటిష్ట భద్రతను చేపట్టారు. సాధారణంగా గణతంత్ర వేడుకలను ప్రతి ఏడాది శివాజీ పార్క్‌లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు మెరిన్‌డ్రైవ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలను జరుపనున్నారు. దీంతో  ఇప్పటినుంచే ఆ ప్రాంతంలో నిరంతర  నిఘా ఏర్పాటుచేశారు. వేడుకలను సముద్ర తీరం వెంబడి నిర్వహించనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు.  
 
 కాగా గణతంత్ర దినోత్సవం నాడు వీఐపీలు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఇక్కడికి రానున్నందున పరేడ్ నిమిత్తం గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మెరిన్ డ్రైవ్ వద్ద రోజూ ఉదయం, రాత్రివేళ్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని తమ సిబ్బందికి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశామన్నారు. మామూలు రోజుల్లో, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ గణతంత్ర దినోత్సవాలు జరిగేవరకు ‘నోఫ్లయింగ్ జోన్’గా ప్రకటించాలని స్టేట్ ప్రొటోకాల్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, మెరిన్‌డ్రైవ్ వద్ద ఇరు దిశల్లో ట్రాఫిక్‌కు అనుమతి ఉండదన్నారు. ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’, ‘ఫోర్స్‌వన్’ నుంచి సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 26/11 దాడులను దృష్టిలో పెట్టుకొని   తమ సిబ్బంది మఫ్టీలో అత్యాధునిక పరికరాలతో సంచరిస్తారని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు