-

అపర భగీరథుడు

2 Sep, 2016 09:57 IST|Sakshi
అపర భగీరథుడు

జలయజ్ఞం... అన్నదాత కష్టాలకు పరిష్కారం.. కరువు రక్కసిపై ప్రయోగించిన వజ్రాయుధం

తన తాత ముత్తాతలకు సద్గతులు కల్పించాలన్న లక్ష్యంతో నాడు భగీరథుడు దివి నుంచి భువికి గంగను రప్పించడానికి తపస్సు చేశాడన్నది పురాణగాథ! తెలుగు నేల నుంచి కరవు రక్కసిని శాశ్వతంగా తరిమికొట్టి.. అన్నపూర్ణ నామాన్ని సార్థకం చేసేందుకు, అన్నదాతల కష్టాలను సమూలంగా తొలగించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో అలాంటి భగీరథ ప్రయత్నమే చేశారు.

బడ్జెట్‌లో సింహభాగం నిధులు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించి.. ఆ నిధులు సద్వినియోగమయ్యేలా పనులను ఉరకలెత్తించి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి అలుపెరగని పోరాటం చేశారు. రూ.54 వేల కోట్లు ఖర్చు చేసి 18.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించారు. సింహభాగం ప్రాజెక్టులను ఓ కొలిక్కి తెచ్చారు. తెలుగు నేలను అన్నపూర్ణగా పరిఢవిల్లేలా చేసే క్రమంలో దురదృష్టవశాత్తూ దూరమయ్యారు. జలయజ్ఞంపైనా, మహానేత పైనా విషం కక్కినవారే నేడు ఆ ఫలాలను తమ విజయాలుగా ప్రకటించుకుంటుండడం విశేషం.
 
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు మండుటెండలో జరిపిన ప్రజాప్రస్థాన పాదయాత్రలో ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గర నుంచి చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారపగ్గాలు చేపట్టగానే వాటి పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టారు. అందులో ప్రధానమైనది జలయజ్ఞం. అది ఒక భగీరథ యత్నం. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను వైఎస్ చేపట్టారు. 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు మరో 23.53 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు.
 
సింహభాగం నిధులు సాగునీటికే..
అంతకుముందు రాష్ర్టంలో అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. వైఎస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను ప్రాజెక్టులకు కేటాయించారు. ఆ నిధులను సద్వినియోగ మయ్యేలా ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ఆయన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి.. 17 ప్రాజెక్టులను పూర్తి చేసి.. మరో 23 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేశారు. 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెస్తూ దురదృష్టవశాత్తు ప్రజలకు దూరమయ్యారు.
 
పునాదిరాళ్లే బాబు ఘనత..
వైఎస్‌కు ముందు 1995 నుంచి 2004 వరకూ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం.. అవసరం తీరాక వాటిని అటకెక్కించడం ఆయనకు రివాజు.. అందుకు అనేక ఉదాహరణలు...


రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఎన్నికలయ్యాక దానిని అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ-నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండో సారి పునాదిరాయి వేశారు. జనం నమ్మరనే భావనతో పునాదిరాయి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు ముగియగానే యథాప్రకారం ఆ ప్రాజెక్టును అటకెక్కించారు.

వైఎస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే రూ.6,850 కోట్ల వ్యయంతో 4.05 లక్షల ఎకరాలకు సాగునీళ్లు.. 33 లక్షల మందికి తాగునీళ్లు అందించేలా హంద్రీ-నీవాను చేపట్టి.. తొలి దశను పూర్తి చేశారు. రెండో దశలో కూడా 50 శాతం పనులను పూర్తి చేశారు.
ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750ను వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పథకాన్ని తన ఘనతగా చెప్పుకుంటూండటం గమనార్హం.

తోటపల్లిలో మీ పాత్ర ఎంత బాబూ?
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి కోసం 42 చెరువులను నింపాలన్న లక్ష్యంతో తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో చేపట్టారు. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ. 3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తోటపల్లి ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 399 కోట్లు వ్యయం చేశారు. తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశాయి. 2014 మార్చి 31 వరకు రూ. 609.61 కోట్లు ఖర్చు పెట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 12 కోట్లు ఖర్చు పెట్టి.. సెప్టెంబరు 10, 2015న జాతికి అంకితం చేసి, అది తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
వైఎస్ పోల‘వరం’.. చంద్రబాబు అపహాస్యం
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. ఉప్పు సంద్రం పాలవుతోన్న వందల టీఎంసీల గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ఆంధ్రప్రదేశ్‌ను సుభిక్షం చేసేందుకు వైఎస్ పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం.. 301 టీఎంసీలు మళ్లించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 30 లక్షల మందికి తాగునీరు.. 960 మెగావాట్ల జల విద్యుత్, విశాఖకు పారిశ్రామిక అవసరాలు తీర్చే బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఇది. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించి.. పనులు మొదలు పెట్టిన వైఎస్‌కు అప్పటి విపక్షాలు, సరిహద్దు రాష్ట్రాలతో కలిసి అడుగుడుగునా అడ్డుతగిలాయి. కానీ.. వాటిని లెక్క చేయకుండా వైఎస్ ముందుకే సాగిపోయారు.. పోలవరం హెడ్ వర్క్స్‌కు అడ్డుతగలడంతో 174 కిమీల మేర కుడి కాలువ.. 181.50 కిమీల ఎడమ కాలువ తవ్వకం పనులు చేపట్టారు. హెడ్ వర్క్స్ చేపట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌లోనే చేస్తున్నారంటూ అప్పటి విపక్ష నేత చంద్రబాబు ఎకసెక్కాలు ఆడారు.

తన వర్గీయులతో కాలువల తవ్వకానికి భూమి ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేయించారు. ఫలితంగా వైఎస్ తన హయాంలో కుడి కాలువ 145 కిమీలు.. ఎడమ కాలువ 136 కిమీల మేర తవ్వగలిగారు. అప్పుడు ఎగతాళి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం హెడ్‌వర్క్స్ పనులు నీరుగార్చి.. కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పట్టిసీమ ద్వారా తోడిన గోదావరి జలాలను వైఎస్ తవ్వించిన కుడి కాలువ గుండానే తరలిస్తున్నారు. వైఎస్ హయాంలో మిగిలిపోయిన 29 కిమీల కాలువను 20 మీటర్ల వెడల్పుతో తూతూమంత్రంగా తవ్వి.. దీని ద్వారా చెంబుడు గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో కలిపి అదే నదుల అనుసంధానం అంటున్నారు.

మరిన్ని వార్తలు