అనుమానాస్పద స్థితిలో మాజీ సైనికుడి మృతి

3 Oct, 2013 06:09 IST|Sakshi
వేలూరు, న్యూస్‌లైన్: గుడియాత్తంకు చెందిన టీచర్ హత్య కేసులో పోలీసు విచారణకు వెళ్లిన మాజీ సైనికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ మంజునాథన్ ఆదేశాలు జారీ చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం కామాక్షిమ్మన్‌పేటకు చెందిన సుకుమార్(41) కొట్టారమడుగులో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. సుకుమార్ 28వ తేదీన కట్టాగుట్ట చెరువులో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుకుమార్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్న అదే ప్రాంతానికి చెందిన హోమియోపతి డాక్టర్ ధరణిని విచారించారు.
 
 సుకుమార్‌కు విషపు ఇంజక్షన్ వేసి హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం ఆటో డ్రైవర్ తెన్‌కొడియన్ సాయంతో కట్టాగుట్ట చెరువులో పడేసినట్టు తేలింది. వీరిని అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన మాజీ సైనికుడు గోపి అలియాస్ గోపాల్(41)ను పోలీసులు విచారణ పేరుతో మేల్ పట్టి పోలీస్ స్టేషన్‌కు మంగళవారం సాయంత్రం తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో గోపాల్ స్పృహతప్పి పడి ఉన్నాడని పోలీసులు గుడియాత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గోపాల్ మృతి చెంది ఉన్నాడని వైద్యులు తెలిపారు. 
 
 అనంతరం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న కామాక్షిమ్మన్ పేట గ్రామస్తులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ గజేంద్రన్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. గోపాల్ భార్య లత మాట్లాడుతూ తన భర్త ఆర్మీలో హవల్‌దార్‌గా పనిచేసి సంవత్సరం క్రితమే ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. తన భర్త గోపాల్ చేతులకు పోలీస్ స్టేషన్‌లో బేడీలో వేశామని, బేడీలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారని వాపోయారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.
 
 మృతి చెందిన తన భర్త మృతదేహాన్ని గుడియాత్తం ఆస్పత్రి నుంచి వేలూరు ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై తహశీల్దార్ గజేంద్రన్ పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఈ మేరకు ఐజీ మంజునాథన్, డీఐజీ మురుగన్, ఎస్పీ విజయకుమార్ మేల్‌పట్టి పోలీస్ స్టేషన్, గ్రామస్తుల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. అనంతరం మేల్‌పట్టి ఇన్‌స్పెక్టర్ మురళీధరన్, ఎస్‌ఐ ఇన్బరసన్, హెడ్‌కానిస్టేబుల్ ఉమాశంకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
మరిన్ని వార్తలు