24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి

28 Feb, 2020 14:39 IST|Sakshi

డీఎంకే ఎమ్మెల్యేలు కేపీపీ స్వామి, కథావరయణ్‌ కన్నుమూత  

సాక్షి, చెన్నై: తమిళనాడులో 24 గంటల్లో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డీఎంకే పార్టీ మరో ఎమ్మెల్యే తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే (డీఎంకే), మాజీ మంత్రి కేపీపీ స్వామి (58) గురువారం కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్న 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1962 జూలై 1వ తేదీన జన్మించిన స్వామి చెన్నై కేవీ కుప్పంలో నివసిస్తున్నారు. ఐదు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత ఇంటివద్దనే వైద్యసేవలు అందుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యం మరింత విషమించగా గురువారం ఉదయం 6.10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. స్వామి మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీశ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు.  

అంచెలంచెలుగా.. 
డీఎంకే సీనియర్‌ నేత, మాజీ కౌన్సిలర్‌ పరశురామన్‌ కుమారుడు స్వామి. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువత్తియూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది మత్స్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్‌ చేతిలో ఓడిపోయారు. 2016 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీఎంకే మత్స్య విభాగం ఇన్‌చార్జ్‌గా నియమితులైనారు. డీఎంకే అగ్రనేత కరుణానిధితో ఎంతో సఖ్యతగా మెలిగేవారు. కేపీపీ స్వామి భార్య, మాజీ కౌన్సిలరైన ఉమ, పెద్ద కుమారుడు ఇనియవన్‌ కొంతకాలం క్రితం మరణించారు.

కుమార్తె ఉదయకు వివాహం కాగా భర్తతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు పరశు ప్రభాకరన్‌ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కేపీపీ స్వామికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. స్వామి కుటుంబ సభ్యుల్లో దాదాపుగా అందరూ డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టినత్తార్‌ ఆలయం వీధి సమీపంలోని శ్మశానవాటికలో స్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 99కి తగ్గింది. 

మత్స్యకార కుటుంబాలకు ఎనలేని సేవ : స్టాలిన్‌ 
మత్స్యకార సామాజికవర్గానికి స్వామి ఎనలేని సేవలు చేశారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కొనియాడారు. కేవీకుప్పంలోని స్వామి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. స్వామి మరణం తనను ఎంతో కలచివేసిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన స్వామి అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించేవారని, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన కాలంలో ఆ సామాజిక వర్గానికి ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు.

మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనతో పట్టుబట్టి మరీ పనులు చేయించుకునేవారని గుర్తుచేసుకున్నారు. అనారోగ్యానికి గురైనపుడు స్వయంగా వెళ్లి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నానని, అయితే తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలను వివరించారని అన్నారు. స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌ సంతాపం ప్రకటించారు. 

గవర్నర్‌ సంతాపం  
డీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేపీపీ స్వామి ఆకస్మిక మరణం ఎంతో ఆవేదనను కలుగజేసిందని గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. తిరువొత్తియూరు నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటని అన్నారు. స్వామిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు