ఐఏఎస్‌ అకాడమీ శంకరన్‌ బలవన్మరణం

13 Oct, 2018 11:02 IST|Sakshi
భార్య, పిల్లలతో శంకరన్‌

ఉరేసుకుని ఆత్మహత్య

సాక్షి ప్రతినిధి, చెన్నై: సివిల్స్‌ పరీక్షలు రాయాలని భావించే దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు చప్పున స్ఫురించే పేరు ‘శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ’.  చెన్నై అన్నానగర్‌లో శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ పేరుతో సివిల్‌ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని నడుపుతుండగా ఇతర రాష్ట్రాల్లోనూ శాఖలున్నాయి. స్వల్పవ్యవధిలోనే శంకరన్‌ విద్యార్థులు ఐఏఎస్‌లో దేశస్థాయిలో టాప్‌ 10లో నిలిచారు. 900 మందికిపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 1,500 మంది శిక్షణ పొందుతున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు చేరడం ప్రారంభించారు. నాలుగేళ్లలో శంకరన్‌ అకాడమీ అత్యున్నత స్థానానికి చేరుకుని పేరు ప్రఖ్యాతులు సాధించడంతో దేశంలోని ఇతర ఐఏఎస్‌ శిక్షణ కళాశాల వారితో పోటీ నెలకొం ది. తమిళనాడులో రెండో స్థానాన్ని అందుకుం ది. భార్య వైష్ణవి (42), సాగణ (12), సాధన (05) అనే ఇద్దరు కుమార్తెలతో చెన్నై మైలా పూరు కృష్ణస్వామి అవెన్యూలో నివసించే శంకరన్‌ది చూడచక్కనైన కాపురం. 

అయితే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే శంకరన్‌ కుటుంబపరమైన సమస్యలతో సతమతం అవుతున్నట్లు సమాచారం. శంకరన్‌పై అనుమానం పెంచుకున్న భార్య తరచూ ఘర్షణపడేదని చెబుతున్నారు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న శంకరన్‌కు, వైష్ణవికి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. భార్యపై కోపంతో భోజనం చేయకుండానే తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. తగవు కారణంగా భార్య సైతం ఆ గదిలోకి వెళ్లలేదు.

ఎంతసేపటికీ గది నుంచి భర్త బైటకు రాకపోవడంతో వైష్ణవి అతని సెల్‌కు ఫోన్‌ చేసింది. అయితే బదులురాలేదు. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోని వారంతా కలిసి గదితలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్‌షీట్‌తో ఉరేసుకుని శంకరన్‌ శవంగా వేలాడుతున్నాడు. భార్యాభర్తల మధ్య పెరిగిపోయిన మనస్పర్థలు, శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ అగ్రస్థానానికి చేరుకోవడంతో పోటీ సంస్థల వల్ల మానసిక ఒత్తిళ్లు శంకరన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. విద్యార్థుల పట్ల స్నేహభావంతో మెలిగేవాడు, పేదవారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేవారని కరుణాకరన్‌ అనే విద్యార్థి ఆవేదన చెందాడు. ప్రతి విద్యార్థి సివిల్స్‌ రాయాలి, ఐఏఎస్‌ కావాలని తపించేవాడని అతడు వాపోయాడు. ఇంతటి మంచి వ్యక్తులు అతికొద్ది మందే ఉంటారు, శంకరన్‌ మాస్టారిని కోల్పోయామని కన్నీరుమున్నీరయ్యాడు.

మరిన్ని వార్తలు