రూ.562 కోట్లు దండుకున్నారు

17 Dec, 2013 23:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేవలం నెల రోజుల్లో మన పెట్టుబడి అమాంతంగా మూడు రెట్లు అవుతుందంటే ఎవరికి ఆశపుట్టదు ? సరిగ్గా ఈ దురాశనే అవకాశంగా మార్చుకుని దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడింది ఓ ముఠా. వివిధ ప్రాంతాలకు చెందిన రెండు లక్షల మందికిపైగా ప్రజలను మోసగించి ఏకంగా రూ.562 కోట్లు దండుకుంది. ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అక్కడే జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 95 కేసులు నమోదైనట్టు తేలింది. మోసపోయినవారిలో ఢిల్లీవాసులు 2,800 మంది ఉన్నారు. వీరి నుంచి రూ.25 కోట్ల మేర దోచుకున్నారు.

క్రైంబ్రాంచ్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ జాయింట్ కమిషనర్ ప్రవీర్‌జైన్ తెలిపిన ప్రకారం వివరాలు.. నిందితులను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందిన అశోక్ జడేజా, కమిజిభాయ్ జడేజా, ప్రవీణ్ పోపట్, కేశారాంగా గుర్తించారు. ముఠాలో కీలక సభ్యుడైన అశోక్ జడేజా తనకు సిక్‌దార్‌మాత అతీతశక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బును మూడింతలు చేస్తానంటూ సకోతర్‌మాతా సమాజ సభ్యులను మోసగించేవారు. మూడు రోజుల నుంచి నెలలోపు డబ్బు మూడింతలు అవుతుందంటూ వారిని నమ్మబలికేవారు. దీంతో అమాయకులు ఎంతోమంది వీరికి డబ్బును సమర్పించుకున్నారు.

అశోక్ జడేజా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని దేవ్యాప్తంగా ఏజెట్లను పెట్టుకుని మరీ డబ్బు వసూలు చేశాడుు. మతాన్ని, మూఢవిశ్వాసాలను అడ్డపెట్టుకుని ముఠా చేసిన మాయలో ఢిల్లీవాసులు సైతం పెద్ద సంఖ్యలో పడ్డారు. పక్కా వ్యూహాన్ని రచించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీస్ ఈఓడబ్ల్యూ విభాగం పోలీసులు గుజరాత్ పోలీసు సిబ్బంది సహాయంతో వీరిని అరెస్టు చేశారు. గుజరాత్‌లో నేరాలకు సంబంధించి వీరంతా ప్రస్తుతం అక్కడే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు