‘జువెలరీ’ దొంగలు అరెస్ట్‌

12 Sep, 2017 08:15 IST|Sakshi
‘జువెలరీ’ దొంగలు అరెస్ట్‌

ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి నగలు స్వాధీనం

దొడ్డబళ్లాపురం : 11 ప్రత్యేక కేసులకు సంబంధించి నెలమంగల పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.29 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు గ్రామీణ ఎస్పీ అమిత్‌ సింగ్, నెలమంగల డీవైఎస్పీ రాజేంద్రకుమార్‌ సోమవారం పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జువెలరీ షాపుకు కన్నం వేసిన కేసులో సుశాంత్,  సిద్ధరాజు, జగదీష్, అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

మూడు నెలల క్రితం కేఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శ్రీ బాలాజీ జువెలర్స్‌ అండ్‌ బ్యాంకర్స్‌ దుకాణానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ద్వారా 14 మీటర్ల దూరం వరకూ సొరంగం తవ్వి 200 గ్రాముల బంగారు నగలు, 14 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశారు. నెలమంగల పరిధిలో వీరిని పట్టుకున్న పోలీసులు వారి నుండి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సునిల్‌కుమార్‌ అనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఒక కారు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరు, బెంగళూరు గ్రామీణ పరిధిలో కార్లు, బైక్‌లు చోరీ చేసేవాడని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు