ఉచితంగా కళ్యాణం.. ప్రతి జంటకూ రూ.55 వేలు

1 Nov, 2019 09:40 IST|Sakshi
వేలాది పేద కుటుంబాలకు ఉచిత వివాహాలతో లబ్ధి (ఫైల్‌)

త్వరలో సామూహిక వివాహోత్సవాలు  

ప్రతి జంటకూ రూ.55 వేల వస్తుసామగ్రి  

దేవాదాయ మంత్రి పూజారి వెల్లడి  

బొమ్మనహళ్లి: దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో ఇక పైన యేడాదిలో రెండుసార్లు ఉచిత సామూహిక వివాహలను నిర్వహిస్తామని  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కోటా శ్రీనివాస పూజారి తెలిపారు. గురువారం నగరంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంపిక చేసిన సుమారు 90 నుంచి 100 దేవాలయాల్లో నిరుపేద యువతి, యువకులకు కంకణ భాగ్యం కల్పిస్తామని తెలిపారు.  

వచ్చే ఏప్రిల్, మేలలో నిర్వహణ  
వచ్చే యేడాది ఏప్రిల్‌ 26వ తేదీన, మే నెల 24వ తేదీన ఈ సామూహిక వివాహాలను జరిపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే పథకం ఉద్దేవమన్నారు. వధూవరులకు కొత్త బట్టలు, తాళిబొట్టు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని, తల్లిదండ్రుల అనుమతితో పాటు మరో 24 నిబంధనలు పాటించినవారు ఈ సామూహిక వివాహ వేడుకల్లో ఒక్కటి కావచ్చని తెలిపారు. పెళ్ళి చేసుకోబోయే జంట 30 రోజుల ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని, సమీప ప్రముఖ దేవాలయాల్లో నమోదుకు అవకాశమిస్తారు.

ఉచితంగా మాంగల్యం, బట్టలు, బాండు  
సుమారు రూ. 40 వేల ఖర్చుతో వధువుకు 8 గ్రా ముల బంగారు మాంగళ్యం, వరుని బట్టలకు రూ. 5 వేలు, వధువుకు చీర తదితరాలకు రూ.10 వేలు, ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని మం త్రి చెప్పారు. పెళ్లయిన తరువాత ప్రతి జంటకు మహిళా శిశు సంక్షేమ శాఖ రూ. 10 వేల బాండ్‌ను అందజేస్తుంది. ఇలా ప్రతి దంపతులకూ రూ. 55 వేల లబ్ధి కలుగుతుందని చెప్పారు. తొలిసారి వెయ్యి జంటలకు పెళ్లి చేయాలన్నది లక్ష్యమని అన్నారు.  ఈ పథకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చుస్తామని అన్నారు. కుక్కె సుబ్రమణ్య, కల్లూరు మూకాంబిక, మైసూరు చాముండేశ్వరి తదితర 100 ప్రముఖ ఆలయాల్లో ఈ సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తామని అన్నారు. 

రసాయన కుంకుమ నిషేధం   
రసాయనాలతో తయారుచేసిన కుంకుమను కొన్ని దేవాలయాల్లో వాడుతున్నట్లు తెలిసిందని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ పరిదిలో ఉన్న ఆన్ని దేవాలయాల్లో రసాయనాలతో కూడిన కుంకుమను నిషేధిస్తామని చెప్పారు. గుడుల వద్ద వాటి విక్రయాలను కూడా నిషేధిస్తామని తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా