ఏడాది తర్వాతే ఉచిత వైఫై..

21 Feb, 2015 10:31 IST|Sakshi
ఏడాది తర్వాతే ఉచిత వైఫై..

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నగరానికి వైఫై ఇంటర్నెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 'నా పిల్లలు కూడా వైఫై వాడతారు కానీ, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది కాలం పడుతుంది' అని ఆయన శుక్రవారం తెలిపారు. కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సభలో మాట్లాడుతూ.. విద్యుత్, నీటి సరఫరా అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటికీ నెలసరి ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీరు, విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ అంశాలపై పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుందని, అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 'తక్కువగా మాట్లాడు-ఎక్కువగా పనిచేయడం' తమ ప్రభుత్వ పాలసీ అని కేజ్రీవాల్ అన్నారు. తమ టీమ్ ఓ పద్ధతి ప్రకారమే పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.అవినీతి నిరోధించడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అవినీతి స్థాయిని బట్టి కొందరు వ్యక్తులు మాత్రమే శిక్షింపబడతారని అన్నారు. కాగా వైఫై సౌకర్యం అన్ లిమిటెడ్ కాదని, రోజులో కేవలం అరగంట మాత్రమే వైఫై ఇచ్చే యోచనలో ఉన్నామని, డౌన్ లోడింగ్ పై ఆంక్షలు ఉంటాయని ఆప్ నేతల సమాచారం.

మరిన్ని వార్తలు