పదవి నుంచి తప్పించే కుట్ర

6 Mar, 2016 02:16 IST|Sakshi
పదవి నుంచి తప్పించే కుట్ర

శాసన సభలో విపక్షాలపై సిద్ధు మండిపాటు
చిన్న విషయాలపై అనవసర రాద్ధాంతం
అది దొంగలించిన వాచీ కాదు...
ఓ మిత్రుడి బహుమానం వాచీపై సీఎం వివరణ

 
బెంగళూరు:  వెనకబడిన వర్గాల వారి తరఫున ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కే ప్రయత్నం ఎంతో కాలంగా జరుగుతూనే ఉందని, అందులో భాగంగానే ఇప్పుడు కూడా తనను పదవి నుంచి తప్పించే కుట్రకు తెరతీశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలపై మండిపడ్డారు. అందులో భాగంగానే వాచ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే విషయమై శాసన సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వాచీ సంబంధ ఆరోపణలు, రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఇదే సందర్భంలో శాసన సభలో సీఎం సిద్ధు ఉటంకించారు. తాను దేవుడిని నమ్ముతానని అయితే రోజూ పూజలు, హోమాలు చేయనన్నారు. బసవణ్ణ సిద్ధాంతాలను ఆచరిస్తానని పేర్కొన్నారు. ఆత్మసాక్షిని నమ్ముకుని పనిచేస్తున్నానని ఒక్క ఆరోపణ కూడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నానని సిద్ధరామయ్య తెలిపారు. ఈ సమయంలో కలుగజేసుకున్న జేడీఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి...‘అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో మీరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.

ఇందుకు సీఎం సమధానమిస్తూ...‘అర్కావతి విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. నాకు న్యాయస్థానంపై నమ్మకముంది. అందువల్ల ఈ  విషయంపై ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మీపై రూ.150 కోట్ల లంచం ఆరోపణలు రాలేదా?’ అంటూ ప్రశ్నకు ప్రశ్నగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు కేసులను సీబీఐకు అప్పగించానని మీ హయాంలో ఒక్క కేసు అయినా సీబీఐ చేత దర్యాప్తు చేయించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఒక్క తప్పు కూడా జరగలేదని తాను అనడం లేదని అయితే చిన్న విషయాలను కూడా భూతద్ధంతో చూపిస్తూ తనపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేను వెనుకబడిన తరగతికి చెందిన వాడిని. రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన వారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం చాలా కష్టం. అయినా నేను కష్టపడి ఆ స్థానంలో కుర్చొన్నాను. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. మొత్తంగా సామాజికంగా వెనుకబడిన వారు సీఎం పీఠం దక్కించుకోవడం చాలా కష్టం అనుకుంటే ఆ స్థానంలో కొనసాగడం మరింత కష్టం’ అంటూ విశ్లేషించారు.
 
దొంగిలించిన వాచీ కాదు...
తాను ధరించిన ఖరీదైన హోబ్లాట్ వాచ్ దొంగలించినది కాదని స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభకు స్పష్టం చేశారు.  సదరు వాచీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం, శాసనసభ సమావేశాలు ముగిసేలోపు సీఎం సిద్ధరామయ్యతో వివరణ ఇప్పిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప రెండు రోజుల ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య శాసనసభ సమావేశాలు ముగిసిన శనివారం రోజుల సదరు వాచ్‌పై వివరణ ఇచ్చారు. స్నేహితుడు కానుకగా ఇచ్చిన వాచ్‌పై  జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ సమయంలో కలుగజేసుకున్న విపక్ష బీజేపీ ఫ్లోర్‌లీడర్ జగదీష్‌శెట్టర్ ‘ఆరోపణలు వచ్చిన వెంటనే చేతిలో ఉన్న వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిం ఉంటే సబబుగా ఉండేది. ఇప్పుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ప్రజలు నమ్మలేరన్నారు.’ అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని తాను ఇచ్చిన వివరణను అందరూ నమ్ముతున్నారని సిద్ధరామయ్య జవాబిచ్చారు. ఆ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘మీరు ఇచ్చిన జవాబు సరే...అయితే మీకు గిఫ్ట్‌గా ఇచ్చిన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల చేతికి చిక్కుతారు.’ అన్నారు. దీంతో కంగు తిన్న సీఎం సిద్ధరామయ్య అలాంటిది ఏమీ జరుగదు. సదరు వాచ్‌కు ఆయన అన్ని రకాల పన్నులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆయన అందజేశారు.’ అని సిద్ధరామయ్య వివరణ ఇవ్వడంతో వాచ్‌పై చర్చకు తెరపడింది.   
 

>
మరిన్ని వార్తలు