చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు

21 Sep, 2013 01:34 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వైపు కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. మరోవైపు రూ.100 ఖర్చు చేసినా సంచిలో ఏమూలకూ రాని కూరగాయలు.. ఇలా చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి గత నెల తో పోలిస్తే కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రవాణాభారం, తక్కువ మొత్తంలో అందుబాటులో ఉండడంతోసామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజధాని కూరగాయల వ్యాపారులు చెబుతున్న ప్రకారం.. గత జూన్ 16న వరదల కారణంగా యమునా నదీతీరాన వందల ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయల పంటలు కొట్టుకుపోయాయి. దీంతో పూర్తిగా బయటి నుంచి వచ్చే కూరగాయలపైనే నగర వాసులు ఆధారపడాల్సి వస్తోంది. దీనికి తోడు ఇటీవల పెంచిన సీఎన్‌జీ ధరలతో రవాణా చార్జీలు మరికాస్త పెరిగాయి.
 
 ఫలితంగా కూరగాయల ధరలు తగ్గడం లేదు. కొత్త పంటలు మార్కెట్లలోకి రావడానికి మరో నెల సమయం పడుతుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూరగాయలు నగరానికి దిగుమతి కానున్నాయని వారు పేర్కొన్నారు. దసరా పండుగ వరకు కూరగాయల ధరలు పూర్తిగా తగ్గుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆజాద్‌పూర్ మండీ వ్యాపారులు చెబుతున్న ప్రకారం కొన్ని రోజులుగా కూరగాయలు కాస్త ఎక్కువ పరిమాణం లో వస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి ధరలు సర్దుకునే అవకాశం ఉన్నట్టువారు తెలిపారు.
 
 దిగుమతులతో కాస్త ఊరట
 ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయలు నగరానికి చేరుకోవడంతో వీటి టోకుధరలు రూ.10 మేర తగ్గాయి. అయితే చిల్లర ధరలు మాత్రం రూ.70-80 వరకు పలుకుతున్నాయి. దాదాపు రెండువేల క్వింటాళ్ల లోడ్లతో ఉన్న 25 ఉల్లి ట్రక్కులు ఆజాద్‌మండీకి శుక్రవారం చేరుకున్నాయని వ్యాపారులు చెప్పారు. అఫ్ఘానిస్థాన్ నుంచి కూడా దిగుమతులు రావడంతో వీటి కిలో టోకుధరలు రూ.60 నుంచి రూ.50కి పడిపోయాయి. 
 
 పస్తుతం రూ.60కి కేజీ చొప్పున విక్రయిస్తున్న మదర్ డెయిరీలు శనివా రం రూ.50కే అమ్మాలని భావిస్తున్నాయి. ఉల్లి కనిష్ట ఎగుమతి ధరలను కూడా ప్రభుత్వం పెంచడంతో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆజాద్‌పూర్ మండీ ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సురేంద్ర బుధిరాజ్ అన్నారు. ధరల పెంపు వల్ల ఎగుమతులు తగ్గుముఖం పడతాయన్నారు. ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండే మహారాష్ట్ర లాసల్‌గావ్ మార్కెట్లోనూ టోకు ధరలు పడిపోవడంతో దాని ప్రభావం ఆజాద్‌పూర్ మండీలోనూ కనిపించిందని బుధిరాజ్ పేర్కొన్నారు.  
 
 వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు
 కూరగాయ= కిలో ధర 
 టమాట= రూ.50
 ఆలు= రూ.40
 పచ్చిమిర్చి= రూ.40
 ఉల్లి = రూ.70
 క్యాబేజీ= రూ.40
 క్యారెట్= రూ.60
 బెండ= రూ.60
 కాకరికాయ= రూ.50
 నిమ్మ= రూ.80 
 వంకాయ= రూ.40
 
మరిన్ని వార్తలు