రిపబ్లిక్ డే డ్రెస్ రిహార్సల్స్ ఆద్యంతం అహ్లాదభరితం

23 Jan, 2014 23:55 IST|Sakshi
 రాజ్‌పథ్‌లో గురువారం నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ మనదేశ సైనిక, సాంస్కృతిక, చారిత్రక విశిష్టతలను మరోసారి కళ్లకు కట్టాయి. పారామిలిటరీ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు మిలిటరీ బ్యాండ్ల సంగీతం హోరులో నిర్వహించిన కవాతులు ఆద్యంతం అలరించాయి. వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు ‘మినీ భారత్’ను రాజ్‌పథ్‌కు మోసుకొచ్చాయి. అయితే ఢిల్లీ,  ఆంధ్రప్రదేశ్ శకటాలు ఈసారి ప్రదర్శనలో కనిపించలేదు. న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనల కోసం సిద్ధమవడానికి రాజ్‌పథ్‌లో గురువారం నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ మనదేశ సాంస్కృతిక, సైనిక పాటవాన్ని కళ్లకు కట్టాయి. అంతేకాదు వీక్షకులకు ఆద్యంతం వినోదం, విజ్ఞానాన్ని పంచాయి. ఈ ఉత్సవాల కారణంగా ఇండియాగేటు పరిసర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
 
 రైజినాహిల్స్ నుంచి ఎర్రకోట వరకు సైనిక, పోలీసు దళాలు నిర్వహించిన కవాతులను వీక్షించడానికి రాజ్‌పథ్‌కు వేలాది మంది చేరుకున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీకి చెందిన మువ్వన్నెల హెలికాప్టర్లు మనదేశ జెండాలను ప్రదర్శిస్తూ గాలిలో చేసిన విన్యాసాలతో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. మొట్టమొదటి స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధవిమానం తేస్, టి-90 భీష్మా ట్యాంక్, ఎంబీటీ అర్జున్ ఎంకే 2 వంటివి మన సైన్యం సత్తాను చాటాయి. వీటికితోడు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు భారత్‌లో సాంకేతిక విజ్ఞాన పురోగతిని కళ్లకుకట్టాయి. పారామిలిటరీ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు మిలిటరీ బ్యాండ్ల సంగీతం హోరులో నిర్వహించిన కవాతులు ఆద్యంతం అలరించాయి. అందంగా అలంకరించిన ఒంటెలపై సైనికబ్యాండ్లు, సైనికులు నిర్వహించిన కవాతులు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
 
 వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు ‘మినీ భారత్’ను రాజ్‌పథ్‌కు మోసుకొచ్చాయి. 13 రాష్ట్రాలు, ఐదు మంత్రిత్వశాఖలు, విభాగాల శకటాలు భారతదేశ ఆర్థికసామర్థ్యం, ఘన సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో తొలుత ఉత్తరప్రదేశ్ శకటం ‘సుభా ఏ బనారస్’ను ప్రదర్శించారు. బనారస్ చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక సంపదను ఇది అద్భుతంగా చూపించగలిగింది. జమ్మూకాశ్మీర్‌లోని పీర్‌పంజల్‌లో నిర్మించిన అతిపొడవైన సొరంగం నమూనాను రైల్వేశాఖ తొలిసారిగా ప్రదర్శించింది. రైల్వేశాఖ గత ఏడాదే ఈ మార్గాన్ని ప్రారంభించింది. భూవిజ్ఞానాలు, వ్యవసాయ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖలు కూడా తమ తమ శకటాలను ప్రదర్శనలో ఉంచాయి.
 
 మహారాష్ట్ర, తమిళనాడు, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రభుత్వ శ కటాలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నాయి. ఈ ఏడాది సాహసబాలల పురస్కారాలకు ఎంపికైన 25 మంది విద్యార్థులు ఈ ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌లో పాలుపంచుకున్నారు. నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ నృత్యాలతో కొందరు విద్యార్థులు సత్తా చాటారు. సశస్త్రసీమాబల్ అధికారులు చేసిన సాహస విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. మోటారుబైకులు, నిచ్చెనలతో చేసిన విన్యాసాలు, మానవ పిరమిడ్లు, బొకేలు, ‘చక్రరూపం’ తదితర విన్యాసాలు ‘వాహ్‌వా’ అనిపించాయి. వాయుసేన విమానాలు ప్రదర్శించిన విన్యాసాలతో ఈ కార్యక్రమం ముగిసింది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌కు హాజరయ్యారు. 
 
మరిన్ని వార్తలు