గాజువాకలో డబ్బులు కాస్తున్నాయ్‌

6 Oct, 2016 03:01 IST|Sakshi
గాజువాకలో డబ్బులు కాస్తున్నాయ్‌

సేవా రంగంలో విజయవాడ ముందంజ
పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాకే టాప్‌
కైకలూరు రైతుల చేపల పంట పండింది
తొలి త్రైమాసికం వృద్ధి గణాంకాలు  ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధితో పాటు తలసరి ఆదాయంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ ప్రజలు తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నారు. అలాగే పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాకనే ముందంజలో ఉంది. గాజువాక నియోజకవర్గ ప్రజలు  రూ.2,64,232 తలసరి ఆదాయంతో తొలి ర్యాంకులో నిలిచారు. అలాగే విశాఖ(పశ్చిమ) నియోజకవర్గం రూ.1,74,109తో రెండో ర్యాంకు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, ఈ కేటగిరీలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం అత్యంత వెనుకబడిపోయింది. ఈ నియోజకవర్గ ప్రజలు రూ.46,905 రూపాయలతో 175వ స్థానంలో నిలిచారు. ఇక పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాక నియోజకవర్గమే ముందంజలో ఉందని ప్రభుత్వం తెలిపింది. స్టీల్‌ ప్లాంటు ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. పారిశ్రామిక ప్రగతిలో గాజువాక రూ.7,359 కోట్లతో తొలి ర్యాంక్‌ దక్కించుకుంది. ఇదే జిల్లాకు చెందిన పెందుర్తి రెండో ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో చివరి ర్యాంకు(175) కూడా ఇదే జిల్లాకు చెందిన అరకు నియోజకవర్గానికి దక్కడం గమనార్హం.

సేవా రంగంలో కూడా కృష్ణా జిల్లాకు చెందిన విజయవాడ(పశ్చిమ) నియోజకవర్గం రూ.4,923 కోట్లతో మొదటి ర్యాంకులో నిలిచింది. ఇక్కడ వ్యవసాయ రంగంలో పురోగతి లేకపోయినప్పటికీ రియల్‌ ఎస్టేట్‌లో దూసుకుపోతుండటంతో విజయవాడ(పశ్చిమ) తొలి ర్యాంకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రంగంలో కృష్ణా జిల్లాకే చెందిన పెడన నియోజకవర్గం రూ.510 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగం ఎటువంటి వృద్ధి సాధించలేదని పేర్కొంటూనే.. చేపలు, పాలు, గుడ్లు, మాంసం రంగాల్లో వృద్ధి సాధించినట్లు సర్కార్‌ పేర్కొంది.

వ్యవసాయ రంగంలో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రూ.3,471 కోట్లతో తొలి ర్యాంకు సాధించింది. అయితే వ్యవసాయ పంటల ద్వారా కాకుండా చే పల చెరువుల ద్వారానే ఈ ర్యాంకు సాధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే వ్యవసాయ రంగంలో గుంటూరు (తూర్పు) నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గం పంటలు, పశుసంవర్థకం, చేపల చెరువుల్లో ఎలాంటి ప్రగతి సాధించలేదని ప్రభుత్వం వెల్లడించింది.

 

మరిన్ని వార్తలు