ఒక్కో వెడ్డింగ్‌ కార్డు ఖరీదు రూ.8వేలు!

8 Nov, 2016 20:48 IST|Sakshi
ఒక్కో వెడ్డింగ్‌ కార్డు ఖరీదు రూ.8వేలు!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్‌​ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్‌ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో జరగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బళ్లారి హవంబావిలోని జనార్దన్‌ రెడ్డి నివాసంలో పెళ్లి కార్యక్రమాలు మొదలయ‍్యాయి. సోమవారం ఇంటిముందు పెళ్లి పందిరి నిర్మించారు. గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ, కుమారుడు కిరీటిరెడ్డి, పెళ్లికూతురు బ్రహ్మణీలతోపాటు గాలి సోమశేఖరరెడ్డి, ఆయన సతీమణి విజయ తదితరులు పూజలో పాల్గొన్నారు.

ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగువేసి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపించారనే నానుడి వింటుంటాం. అంతగా కాకపోయినా తమ రేంజ్‌కు తగ్గట్టుగా తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలు జరిపిస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన కూతురు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. వెడ్డింగ్‌ కార్డుతో పాటు ఖరీదైన వెండి వినాయకుడి విగ్రహం, డ్రై ప్రూట్స్‌​ తదితర సరంజామాను ఓ బాక్స్‌ లో పొందుపరిచి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్‌ కార్డు ఒక్కొక్కదానికి సుమారు రూ. ఏడు నుంచి ఎనిమిదివేల వరకూ ఖర్చు అయినట్లు భోగట్టా.

వినూత్నంగా తయారు చేయించిన ఈ వెడ్డింగ్‌ బాక్సులో పెళ్లి పిలుపుతో పాటు ప్రత్యేకంగా ఎల్సీడీ స్క్రీన్‌ ఏర్పాటుచేశారు. బాక్స్‌ తెరవగానే గాలి జనార్దన్‌ రెడ్డి కుటుంబసభ్యులు ఉన్న వివాహ పాట మొదలవుతోంది. నిమిషం నిడివిగల ఆ వీడియోలో 'అతిథిదేవోభవా..' అంటూ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడితోపాటు వధూవరులిద్దరూ కనిపిస్తారు. పెళ్లికి తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తున్న గాలి  జనార్దన్‌ కుటుంబం ఆ వీడియోలో కనిపిస్తుంది. 

 

మరిన్ని వార్తలు