తుపాకీతో కాల్చబోయాడు

23 Jan, 2019 13:20 IST|Sakshi
కంప్లి ఎమ్మెల్యే గణేశ్, ఆస్పత్రిలో ఆనంద్‌సింగ్‌

నిన్ను, నీ బంధువుల అంతు చూస్తానన్నాడు

గణేశ్‌ ఇష్టానుసారం నాపై దాడి చేశాడు  

పోలీసులకు వెల్లడించినఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌?

దాడి కేసు హత్యాయత్నంగా మార్పు  

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే గణేశ్‌

బొమ్మనహళ్లి/శివాజీనగర: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్, గణేశ్‌ల మధ్య గత శనివారం ఈగల్‌టన్‌ రిసార్టులో జరిగిన ఘర్షణపై పోలీసు దర్యాప్తు ఆరంభమైంది. ఇది ముందు అనుకున్నంత చిన్న కేసు కాదని తెలుస్తోంది. తుపాకులు, హత్యాయత్నం వరకు వెళ్లిందని బాధిత ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ ఖాకీల ముందు పేర్కొన్నారు. ఆ దాడిలో తలకు తీవ్ర గాయాలతో నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్‌సింగ్‌ను కలిసి బిడది పోలీసులు వివరాలను సేకరించారు. తాజా వివరాలతో దాడి కేసులో హత్యాయత్నం అభియోగంగా మార్చారని తెలిసింది. ఈ దాడి కేసులో ఎమ్మెల్యే గణేశ్‌ పైన ఆనంద్‌సింగ్‌ కుటుంబీకులు కేసు పెట్టడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం తెలిసిందే. మంగళవారం ఆస్పత్రికి వెళ్ళిన పోలీసులు ఐసీయూ వార్డులోనే ఆనంద్‌సింగ్‌ను కలిశారు. దాడి గురించి పలు కోణాల్లో సమాచారాన్ని తీసుకున్నారు. మరోపైన తనపైన కేసు నమోదు కావడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో ఎమ్మెల్యే గణేశ్‌ ముందుజాగ్రత్తగా అజ్ఞాతంలో వెళ్లిపోయారని సమాచారం. దాడి కేసులో ఆయనను కలవడానికి బిడది పోలీసులు ప్రయత్నింగా ఆయన అందుబాటులోకి రావడం లేదని తెలిసింది. 

ఆనంద్‌సింగ్‌ ఏం చెప్పారంటే  
ఆనంద్‌సింగ్‌ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... ఈగల్‌టన్‌ రిసార్టులో రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో ఉన్న కరువు సమస్యపైన పార్టీ పెద్దలు సమావేశం జరిపారు. ఈ సమావేశానికి నేను హాజరయ్యాను.  అందరితో కలిసి భోజనం చేసి వెళుతున్న సమయంలో కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌ వచ్చారు. ఎన్నికల సమయంలో నీవుడబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదు. నిన్ను, మీ అక్క కొడుకు సందీప్‌ కథను ముగించేస్తానని నన్ను హెచ్చరించాడు. నేను వెంటనే.. మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అని అడిగా. గణేశ్‌ స్పందిస్తూ మొదట వారిని కాదు, నిన్ను ముగిస్తే అన్ని సమస్యలు సరిపోతాయని ఒక్కసారిగా నాపైన దాడి చేశాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ అక్కడ ఉన్న కట్టెతోను, పూలకుండీతోను గట్టిగా కొట్టాడు. తుపాకీ ఇవ్వండి, వీడిని ఇక్కడే ముగించేస్తానని కేకలు వేశాడు. నా తల, ముఖం పైన తీవ్రంగా కొట్టాడు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. దాడిని అక్కడే ఉన్న మంత్రి తుకారాం, తన్వీర్‌ సేఠ్, ఎమ్మెల్యేలు రఘుమూర్తి, రామప్పలు అడ్డుకొన్నారని తెలిపారు. ఆనంద్‌ సింగ్‌ వద్ద సమాచారం తీసుకొన్న పోలీసులు ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసుగా మార్చినట్లు సమాచారం. గణేశ్‌ తనపై దాడిచేసి హత్యకు యత్నించాడని, తనను చంపడానికి తుపాకీ ఇవ్వకపోవటంతో ఆగ్రహించి గన్‌మ్యాన్‌ చెయ్యిని కొరికాడని ఆనంద్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. 

గణేశ్‌ ఎక్కడ
ఎమ్మెల్యే గణేశ్‌ ఆచూకీ దొరక్కపోవడం సంచలనం కలిగిస్తోంది. అరెస్టు భయంతోనే గణేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. గణేశ్‌ ఏం చేయాలో దిక్కుతోచక అదృశ్యమయ్యాడని తెలిసింది. ఆయన మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాడి ఘటన  తరువాత సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేదు. ముందస్తు బెయిల్‌ పొందే యత్నాల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు