అట్టహాసంగా గణేశ్, మార్కండేయ జయంతి

24 Jan, 2015 00:38 IST|Sakshi

షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేశ్, మార్కండేయ జయంతిని భక్తులు అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రముఖ గణేశ్ ఆలయాలలో భక్తులు తెల్లవారు జామునుండే బారులు తీరారు. అనేక ఆలయాలలో అధర్వశిఘ పఠనం, భజన, పూజార్చనలు నిర్వహించి మహా ప్రసాదంగా అన్నదానం చేశారు. గురువార్‌పేట్‌లోని ఐశ్వర్య సంపన్న గణేశ్ ఆలయంలో ఉదయం అభ్యంగన స్నానం గావించి అభిషేకం, పూజలు నిర్వహించారు.

జోడుబసవన్న చోక్‌లోని తాతాగణపతి ఆలయంలో భక్తులు వేకువ జాము నుంచే భారీ ఎత్తున పూజలు నిర్వహించారని అధ్యక్షుడు గౌరీశంకర్ కొండా తెలిపారు. పద్మశాలి సమాజ్ సభ్యులు గణేశ్, మార్కండేయ ఆల యాలలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారని పద్మశాలి జ్ఞాతి సంస్థ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గుర్రం చెప్పారు. పట్టణంలో తెలుగువారు ప్రతి కూడలి నందు మండపాలు వేసి మార్కండేయ జయంతిని నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఘనంగా మార్కండేయ జయంతి
సాక్షి, ముంబై: ఎల్ఫిన్‌స్టన్ రోడ్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీ మార్కండేయ మహాముని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్‌కర్, నగర్ సేవకులు సుధీర్ జాదవ్, ఆంధ్ర మహాసభ ట్రస్టికి చెందిన ఏక్‌నాథ్ సంఘం, ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశం పాల్గొన్నారు.

ఉదయం శ్రీ శివభక్త శ్రీ మార్కండేయ మహాముని పూజ, హోమం నిర్వహించారు. ఆ తరువాత అతిథుల చేత దీప ప్రజ్వలన గావించారు. తదనంతరం భగవంతున్ని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. జయంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడువేల మందికి పైగా పాల్గొన్నారని సంఘం అధ్యక్షుడు పిట్ల నారాయణ, ప్రధాన కార్యదర్శి పూల రామలింగం, సలహాదారుడు ద్యావర్‌శెట్టి విలాస్ తెలిపారు.
 
పద్మశాలి భవనం ప్రారంభం
భివండీ, న్యూస్‌లైన్ : శ్రీ మార్కండేయ జయంతి పురస్కరించుకొన్ని వినాయక్‌నగర్ పద్మశాలి సమాజ్ భవన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అఖిల పద్మశాలి సమాజ సభ్యులు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ చౌగులే, స్థానిక కార్పోరేటర్ కమ్లాకర్ పాటిల్, సంతోష్ ఎమ్ శెట్టి, బీజేపీ ప్రదేశ్ సభ్యులు శ్యామ్ అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు.
 
భివండీలో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో
భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి కుల సంఘాలతో పాటు పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం  శ్రీ మార్కండేయ మహాముని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
 
అఖిల పద్మశాలి సమాజం పద్మనగర్
పద్మశాలి సమాజ మంగళ్ భవనంలో శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కముటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, నాయనాని కమిటీ చైర్మన్ కొంక మల్లేశం, వంగ పురుషోత్తం, కుందెన్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
 
పద్మశాలి సమాజ్ యువక్ మండలి
మార్కండేయ ముని చౌక్‌రోడ్‌లో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మండలి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు వడ్లకొండ రాము, వాసం రాజేందర్, బాలే శ్రీనివాస్, పాము మనోహర్, కళ్యాడపు భూమేశ్, బొల్లి నవీన్, మార్గం రవి తదితరులు హాజరయ్యారు.
 
పద్మశాలి యువక్ ప్రతిష్టాన్
పద్మనగర్‌లోని బాలాజీ మందిర్‌లో శ్రీ మార్కండేయ మహాముని ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు దావత్ కైలాస్ నేతృత్వంలో నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలొ అధ్యక్షుడు భీమనాతిని శివప్రసాద్, న్యాయవాది సిరిసిల్ల మహేశ్, మామిడాల ధన్వంతరి, కొంక మనోహర్, గుండు వసంత్, తడిగొప్పల జయ్‌ప్రకాశ్, కొక్కుల రవితో పాటు సమాజ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి
ప్రతి  సంవత్సరంలాగే ఈసారి కూడా అయ్యప్ప మందిరం పక్కన ఉన్న శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయంలో స్వామి వారికి సమితి సంస్థాపకులు సంతోష్ ఎం. శెట్టి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి మార్కండేయ మహాముని హోమం, అర్చనలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు మేర్గ భాస్కర్, కార్యదర్శి వడిగొప్పల శంకర్, అడ్డగట్ల సత్తయ్య, చాట్ల రాజారాం, ఆడెపు శ్రీనివాస్, అడ్డగట్ల దత్తాత్రేయ, పాము ఈశ్వర్‌తో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
మహిళల పసుపు-కుంకుమ కార్యక్రమం
శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక నగర్ సేవిక శశిలత శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 200 మంది మహిళలకు పూలు, పండ్లు, చిరు కానుకలు పంచిపెట్టారు.
 
శ్రీ మార్కండేయ ఉత్సవ సమితి కాసర్‌ఆలి
పట్టణంలో ప్రసిద్ది గాంచిన శ్రీ మార్కండేయ మందిరంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకంరించారు. ఉదయం 6 గంటలకు 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి, మందిరం నుంచి కాసర్ ఆలి, పురవీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం నూతన దంపతులు 11 హోమాలతో మార్కండేయ మహాయజ్ఞం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు